అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Nominated Posts | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తోంది. కానీ నామినేటెడ్ పదవులను మాత్రం భర్తీ చేయలేదు. దీంతో ఆశావహులు పదవుల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ పెద్దలు సమావేశం అయ్యారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ కీలక నేతల భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరు అయ్యారు. వివిధ కార్పొరేషన్ ఛైర్ పర్సన్, ఇతర నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల వివరాలు తీసుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్ ఛైర్పర్సన్ (Corporation Chairperson) పదవుల భర్తీపై కాంగ్రెస్ నేతల చర్చించినట్లు తెలిసింది. దీంతో త్వరలో పదవులు వస్తాయని పలువురు ఎదురు చూస్తున్నారు.
Telangana Nominated Posts | ఆశావహుల ప్రయత్నాలు
రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో చాలా మంది పదవులు ఆశిస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. తప్ప అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయిందని.. ఇంకెప్పుడు భర్తీ చేస్తారని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు భేటీ కావడం గమనార్హం. అయితే పదవుల కోసం చాలా మంది ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ జిల్లాల పరిధిలో కీలక నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
Telangana Nominated Posts | వారికే ప్రాధాన్యం
రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ ఎన్నికలకు ముందే కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ అన్నారు. అయితే ఆశావహులు అధిక సంఖ్యలో ఉండటంతో ఆ ప్రక్రియ ఆలస్యం అయింది. గతంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను ఆయన నియమించారు. ఇటీవల జిల్లా కమిటీలను సైతం ప్రకటించారు. ఈ క్రమంలో త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు సమాచారం.

దీనిని కూడా చదవండి : SSC Exams | ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

