అక్షరటుడే, భీమ్‌గల్: BC Declaration | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీ సమాజానికి తీరని అన్యాయం జరిగిందని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. వేల్పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు రాజపూర్ణనందం, మొండి అశోక్, శివసారి నర్సయ్య, బట్టపూర్ ప్రవీణ్ యాదవ్, రేగుంట దేవేందర్ మాట్లాడారు.
BC Declaration | అంకెల్లో మోసం.. అమలులో శూన్యం..
ఎన్నికల వేళ బీసీలకు ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్.. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.12,551 కోట్లు (3.85%) మాత్రమే కేటాయించి మోసం చేసిందని బీసీ నాయకులు మండిపడ్డారు. గత రెండేళ్లలో కేటాయించిన నిధుల్లో 20 శాతం కూడా ఖర్చు చేయలేదని గణాంకాలు చెబుతున్నాయన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని కాలయాపన చేస్తూ స్థానిక సంస్థలు, ఉద్యోగాల్లో బీసీల వాటాను అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు.
BC Declaration | వృత్తి కులాలకు మొండిచేయి..
ముదిరాజ్, గంగపుత్ర, గొల్ల కురుమ, గౌడ, పద్మశాలి, రజక వంటి కులాలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని నాయకులు వాపోయారు. గొర్రెల పంపిణీ, చేనేత, వృత్తి ఆధారిత పథకాలకు సున్నా కేటాయింపులు చేయడం దారుణమన్నారు. రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రస్తావన లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హామీలు నెరవేర్చకపోతే గ్రామగ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీస్తామని హెచ్చరించారు.
సమావేశంలో నాయకులు చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేష్, రేగుల్ల రాములు, దొకంటి నర్సయ్య, కొత్తపల్లి అశోక్, రామ్ రాజ్ గౌడ్, పాపాయి పవన్, బింగి బాల చందర్, శ్రీనివాస్, పాలేపు అశోక్, రాజేశ్వర్, పర్స దేవన్న, మాణిక్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన

