అక్షర టుడే, ఆర్మూర్ : Arunodaya State Conference | ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణోదయ మహాసభలను ఏప్రిల్ 10, 11 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలుత అంజయ్యభవన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కళాకారుల ప్రదర్శన సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి చేరుకొని అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Arunodaya State Conference | సభకు హాజరు కానున్న ప్రముఖులు
సభకు రాష్ట్ర అధ్యక్షుడు వేణు అధ్యక్షత వహించనుండగా.. ముఖ్య అతిథులుగా ప్రముఖ జర్నలిస్టు సతీష్ చందర్, పీవోడబ్ల్యూ జాతీయ నాయకురాలు ఝాన్సీ, రైసింగ్ న్యూ డెమోక్రసీ సహసంపాదకులు కె.గోవర్ధన్, కానూరి తాత కూతురు బేబక్క, ఉదయగిరి, పాల్గొంటారని దాసు తెలిపారు. ఏప్రిల్ 11న మార్క్స్ భవన్లో రాష్ట్ర మహాసభల ప్రారంభోపన్యాసం ప్రొఫెసర్ కాశీం, వక్తలుగా ప్రొఫెసర్ వినయ్ బాబు, లెల్లే సురేష్, అంబిక, పాల్గొంటారని ఆయన తెలిపారు. మహాసభల సందర్భంగా సావనీర్‌ను అరుణోదయ రాష్ట్ర మాజీ అధ్యక్ష కార్యదర్శులు నాగన్న రాయకృష్ణలు ఆవిష్కరిస్తారని చెప్పారు.
Arunodaya State Conference | 52 వసంతాల సుదీర్ఘ పయనం
1974లో అరుణోదయ ఆవిర్భవించిన నుంచి 52 వసంతాల సుదీర్ఘ పయనంలో ప్రజా సంస్కృతి కోసం, ప్రజా కళారూపాలతో కృషి చేసిందని దాసు తెలిపారు. పల్లె జనుల నుంచి పురుడు పోసుకున్న ఒగ్గుకథ, బుర్రకథ, బ్యాలే, వీధి నాటకం, బాగోతం, జానపద కళారూపాలను తీసుకొని ప్రజా సమస్యలను మేలవించి ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ కృషి చేసిందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ పల్లెపల్లెన ఆటపాటతో కృషి చేసిందని వివరించారు.
Arunodaya State Conference | ప్రజా సంపదను కొల్లగొట్టే శక్తులపై పోరాటం
ప్రజా సంపదను కొల్లగొట్టే శక్తులకు వ్యతిరేకంగా అరుణోదయ పోరాటం చేస్తోందని దాసు తెలిపారు. జిల్లా కమిటీ సభ్యుడు నరేష్ మాట్లాడుతూ.. అరుణోదయ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేశ్, లక్ష్మణ్, మల్లేశ్, నరేందర్ ప్రజా సంఘాల నాయకులు ప్రిన్స్, నర్సయ్య, సొప్పరి గంగాధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: CMRF to Beneficiaries | అర్హులకు సీఎంఆర్ఎఫ్ సాయం అందేలా చర్యలు : ఎమ్మెల్యే ధన్పాల్

