అక్షరటుడే, వెబ్డెస్క్: Gold Price Fall | కొన్నాళ్ల క్రితం వరకు రోజుకో రికార్డు స్థాయి గరిష్టాన్ని నమోదు చేస్తూ దూసుకువెళ్లిన బంగారం, వెండి ధరలు (Silver Prices) దిగివస్తున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ధర పతనం అవుతూనే ఉంది. ఆల్ టైమ్ హై నుంచి 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 38 వేలపైన తగ్గింది. వెండి ధర సైతం భారీగా పడిపోయింది.
Gold Price Fall | ఇన్ఫ్లెషన్ భయాలతో..
పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర బ్యారెల్‌కు 113 డాలర్లు దాటింది. యుద్ధం ఇలాగే కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధర మరో 50 శాతానికిపైగా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దీనికితోడు గ్యాస్ కష్టాలూ ఎక్కువవుతున్నాయి. దీని ప్రభావం అన్ని రంగాలపై పడి ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉండడంతో యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సహా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను యథాతధంగా కొనసాగించాలని నిర్ణయించాయి.
ప్రధానంగా ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిల్లో ఉంటే యూఎస్ డాలర్, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయంగా మారి, బంగారం ఆకర్షణ కోల్పోతోంది. ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి వంటి లోహాల ధరలు పతనమవుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినందున ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండడమూ ఆయా లోహాల ధరల పతనానికి కారణంగా నిలుస్తోందంటున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా మరింత పెంచితే భవిష్యత్‌లో బంగారం ధర (Gold Price) మరింత పెరిగే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Gold Price Fall | జనవరిలో ఆల్ టైం హై..
బంగారం ధర జనవరి 29న జీవన కాల గరిష్టాలను చేరింది. ఆ రోజున 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,78,850గా నమోదయ్యింది. యుద్ధ భయాలతో బంగారం, వెండి వంటి లోహాల ధరలు పెరుగుతాయని భావించినా ఆశ్చర్యకరంగా వాటి భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. యుద్ధం ఫిబ్రవరి 28న మొదలవగా.. అప్పటి నుంచి ధరలు దిగివస్తూనే ఉన్నాయి. సోమవారం హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 1.40 లక్షలుగా ఉంది.
Gold Price Fall | వెండిదీ అదేదారి..
వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధర జనవరి 29న రూ. 4.25 లక్షలకు చేరి జీవన కాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత లాభాల స్వీకరణతో కొంత దిద్దుబాటుకు గురయ్యింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంతో మరింత పతనమైంది. సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ. 2.30 లక్షలుగా ఉంది. అంటే ఆల్ టైం హైనుంచి కిలో వెండి ధర రూ. 1.95 లక్షలు తగ్గిందన్న మాట.
ఇది కూడా చదవండి..: Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు

