అక్షరటుడే, కామారెడ్డి: Six Guarantees Budget | ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు శూన్యమని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
Six Guarantees Budget | మేనిఫెస్టోకు.. పాలనకు సంబంధం లేదు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏంటి.. ఇప్పుడు చేస్తుందేంటో చెప్పాలని గంప గోవర్ధన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆరు గ్యారెంటీలను ఆరు చోట్ల ప్రకటించి ఆరు గ్యారెంటీలను చట్టం రూపంలో అమలు చేస్తామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లకు చేరినా మూడు బడ్జెట్లలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించలేదని విమర్శించారు.
Six Guarantees Budget | రాష్ట్రవ్యాప్తంగా..
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 50 శాతం రుణమాఫీ చేయలేదని, 100 శాతం చేసినట్లు నిరూపిస్తే తాము ముక్కు నేలకు రాస్తామని మాజీ ఎమ్మెల్యే అన్నారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని (Oil Palm Factory) ప్రారంభించిన సీఎం రుణమాఫీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ల మీద ఓట్లేసి దేవుళ్లను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. రుణమాఫీ లేదని, 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.2500, పింఛన్ల పెంపు, ఆటో కార్మికులకు రూ.12 వేల సాయం, రైతు కూలీలకు రూ.12 వేలు, విద్యార్థినులకు స్కూటీ, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, విద్యార్థులకు చదువుల కోసం రూ.5 లక్షల సాయం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
Six Guarantees Budget | పింఛన్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు..
బడ్జెట్లో పెంచిన పింఛన్లకు ఒక్క రూపాయి కేటాయించలేదని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. రెండున్నరేళ్లలో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదన్నారు. చివరికి రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. హైకోర్టుకు వెళ్తేనే బెనిఫిట్స్ ఇస్తారా అని ప్రశ్నించారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) గెలిచామని చెప్పుకుంటున్న ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుపై ఇంటలిజెన్స్ నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. అప్పులు తెచ్చి కేసీఆర్ కాళేశ్వరం కట్టారని, మల్లన్న సాగర్ నింపారని, హల్దీవాగు నిండుకుండలా ఉందని తెలిపారు.
Six Guarantees Budget | ప్రైవేట్ బిల్లు పెడతాం..
మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు (Hyderabad) నీళ్లు తరలించేందుకు రూ.7 వేల కోట్లతో శంకుస్థాపన చేసిన విషయాన్ని గంప గోవర్ధన్ గుర్తు చేశారు. వచ్చే రెండుమూడు రోజుల్లో ఆరు గ్యారెంటీలకు నిధులు కేటాయించకపోవడంపై ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెడతామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉందని, ఈ మొండి ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ పేద ప్రజలను విస్మరించిందని, హామీలను తుంగలో తొక్కిందన్నారు. భవిష్యత్తులో హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకుడు కుంబాల రవి యాదవ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలి: కలెక్టర్

