అక్షరటుడే, వెబ్‌డెస్క్: Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సైనిక విమానం కుప్పకూలడంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. పుటుమాయో ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Colombia Plane Crash | టేకాఫ్ సమయంలో..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సైనికులను తరలిస్తున్న ఈ విమానం టేకాఫ్ సమయంలోనే సాంకేతిక లోపంతో కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్లైట్ మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైందని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Colombia Plane Crash | 100 మందికి పైగా సైనికులు..
ఈ ప్రమాదంపై కొలంబియా రక్షణ శాఖ మంత్రి పెడ్రో సాంచేజ్ స్పందించారు.. టేకాఫ్ సమయంలోనే సమస్య తలెత్తి విమానం కుప్పకూలినట్లు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 100 మందికి పైగా సైనికులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, మరణాలపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది,రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపమా, వాతావరణ పరిస్థితుల ప్రభావమా అనే కోణంలో విచారణ జరుగుతోంది.

