అక్షరటుడే, న్యూఢిల్లీ: Fuel Shortage India | మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు భారత దేశంలోని ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ఎల్‌పీజీ గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు.. తాజాగా పెట్రోల్–డీజిల్ కొరత మరో గుదిబండగా మారుతోంది.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇంధన బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంటోంది. దీంతో వాహనదారులు అర్ధరాత్రి వరకు క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
Fuel Shortage India | ఇంధన బంకుల పరిస్థితి
భారత్‌లో దాదాపు 90 వేలకి పైగా ఇంధన బంకులు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన Indian Oil Corporation, Hindustan Petroleum, Bharat Petroleum ప్రధాన భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రధానంగా ఈ సంస్థల ద్వారా ఇంధన సరఫరా జరుగుతోంది.
Fuel Shortage India | రోజువారీ వ్యాపారం
భారత్‌లో రోజుకు (సగటున) 9–10 కోట్ల లీటర్ల పెట్రోల్, 25–30 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోంది. ఈ లెక్కన ఇంధన విక్రయాల ద్వారా జరిగే వ్యాపారం రోజుకు సుమారు ₹9000 కోట్ల నుంచి ₹12,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. డీజిల్ వినియోగం ఎక్కువగా వ్యవసాయం, రవాణా, పరిశ్రమల అవసరాలకు వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
దిగుమతులే ఆధారం..
భారత్ తన అవసరమైన ముడి చమురులో దాదాపు 85 % వరకు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 45–50 లక్షల బ్యారెల్స్ (ఒక బ్యారెల్ ≈ 159 లీటర్లు) క్రూడ్ ఆయిల్ దిగుమతి అవుతుంది. ఈ ముడి చమురును దేశంలో ఉన్న రిఫైనరీల్లో శుద్ధి చేసి డీజిల్, పెట్రోల్, ఇతర ఉత్పత్తులుగా మారుస్తున్నారు.
యుద్ధ ప్రభావం..
మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతింటోంది. ముఖ్యంగా రవాణా మార్గాల్లో అంతరాయం ఏర్పడుతోంది. బీమా, షిప్పింగ్ ఖర్చులు కూడా పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరల్లోనూ అనిశ్చితి నెలకొంది. దీంతో ఇంధన దిగుమతులు ఆలస్యమవుతున్నాయి. ఖరీదు కూడా పెరుగుతోంది. కొన్నిచోట్ల తాత్కాలికంగా సరఫరా నిలిచిపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది. దీంతో దేశీయ మార్కెట్లో కొరత పరిస్థితులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.
వినియోగదారులపై ప్రభావం
ఇంధన కొరత కారణంగా ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాలు క్యూలు కట్టాయి. ఇప్పటికే కొన్ని నగరాల్లో ఉదయం విధులకు వెళ్లే ఉద్యోగులు, రాత్రివేళల వరకు బంకుల వద్ద నిలబడి ఇంధనం నింపించుకుంటున్నారు. ఈ సమస్య ఇంధన కొరత రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెంచుతోంది. ఇది సరకుల ధరల పెరుగుదలకు కూడా కారణం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

