అక్షరటుడే, వెబ్‌డెస్క్: AbhiBus Seat Issue | ఓ గర్భిణికి ముందువైపు సీటు (Front Seat) బుక్ చేసినప్పటికీ అందించకపోవడం ఘటనపై ట్రావెల్ సంస్థపై వినియోగదారుల ఫోరమ్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (District Consumer Commission) రూ.30,000 పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
AbhiBus Seat Issue | అభిబస్ ద్వారా..
వివరాల్లోకి వెళ్తే.. గతేడాది భార్యాభర్తలు కర్నూలు నుంచి బెంగళూరుకు అభిబస్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. తన భార్య గర్భిణి కావడంతో ముందువైపు సీటు అవసరమని భావించిన భర్త ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేశారు. ఇందుకోసం ప్రముఖ బస్సు టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన AbhiBus ను వినియోగించుకున్నారు. రెండు టికెట్లకు కలిపి రూ.2,307 చెల్లించారు. కానీ, ప్రయాణ సమయంలో బుక్ చేసిన ముందువైపు సీటును కేటాంచలేదని బాధితుల ఆరోపణ. దీంతో అసౌకర్యానికి గురైన భార్యాభర్తలు ఈ వ్యవహారంపై కర్నూలులోని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.
AbhiBus Seat Issue | కమిషన్ ఆగ్రహం..
వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 (Consumer Protection Act, 2019) కింద ఈ కేసు నమోదు చేయబడింది. ఈ కేసును Advocate P. Suresh Babu టేకప్ చేసి, కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఎదుట సాక్ష్యాధారాలు ఉంచారు. కేసు పూర్వాపరాలను కమిషన్ పరిశీలించింది. ట్రావెల్ సంస్థ నిర్లక్ష్యాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. గర్భిణికి అవసరమైన సౌకర్యాన్ని అందించకపోవడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. సేవలో లోపం (Deficiency in Service) ఉందని గుర్తించిన కమిషన్ బాధితురాలికి రూ.30,000 పరిహారం చెల్లించాలని ట్రావెల్ సంస్థను ఆదేశించింది.
ఈ తీర్పు వినియోగదారుల హక్కుల పరిరక్షణకు మరో ఉదాహరణగా నిలిచిందని ఈ సందర్భంగా న్యాయవాది పీ సురేష్ బాబు పేర్కొన్నారు. ఆన్‌లైన్ బుకింగ్ సేవలను అందించే సంస్థలు వినియోగదారులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. ప్రయాణికులు తమకు కలిగిన ఇబ్బందులపై చట్టపరమైన మార్గాలను ఆశ్రయించాలని సూచించారు.

