అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Agra Double Murder Verdict | ఆగ్రా (Agra)లో నాలుగేళ్ల క్రితం జరిగిన జంట హత్యల కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కట్టుకున్న భార్యను, ఆమె బంధువును అమానుషంగా హత్య చేసిన కేసులో భర్త గౌరవ్‌తో పాటు అతడి తండ్రి మదన్, సోదరుడు అభిషేక్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. అదనంగా ముగ్గురికీ తలో లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది.
ఈ దారుణ ఘటన 2022 మే 27న ఏత్మాద్‌పూర్ (Etmadpur) ప్రాంతంలో చోటుచేసుకుంది. గౌరవ్ అనే వ్యక్తి తన భార్య పూజకు, ఆమె బంధువైన శివం సిసోడియాకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్నాడు. శివం, పూజను కలిసేందుకు వారి ఇంటికి రావడంతో అతడు మరింత కోపానికి గురయ్యాడు
Agra Double Murder Verdict | కలకలం రేపిన హత్య..
వారిద్దరినీ కలిసి చూసిన గౌరవ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గౌరవ్, అతడి తండ్రి మదన్, సోదరుడు అభిషేక్ కలిసి పూజ, శివంను ఇంటి బయటకు లాక్కొచ్చి ప్రజల మధ్య దాడి చేశారు. మొదట కర్రలతో తీవ్రంగా కొట్టి, అనంతరం కిందపడిన వారిపై గొడ్డలి వంటి పదునైన ఆయుధాలతో దాడి చేసి ఇద్దరి గొంతులు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హత్య అనంతరం గౌరవ్ తండ్రి, సోదరుడు పోలీసులకు లొంగిపోగా, పోలీసులు ఘటనలో ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు మొత్తం 14 మంది సాక్షులను విచారించింది.
Agra Double Murder Verdict | సీసీటీవీ ఫుటేజీ కీలక ఆధారంగా..
ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ (CCTV footage) కీలక ఆధారంగా నిలిచింది. అదేవిధంగా మృతుడు శివం సోదరుడి సాక్ష్యం కూడా కేసును బలపరిచింది. అన్ని ఆధారాలు, ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన అనంతరం న్యాయస్థానం ముగ్గురినీ దోషులుగా తేల్చింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో గౌరవ్ తల్లిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. తీర్పు వెలువడిన సమయంలో దోషులు ఎలాంటి భావోద్వేగం ప్రదర్శించకపోవడం గమనార్హం. ఇక ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని దోషుల తరఫు న్యాయవాదులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Assam Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
