అక్షరటుడే, హైదరాబాద్: Anirudh Concert | గ్రేటర్ హైదరాబాద్ నగరం శనివారం సాయంత్రం సంగీత మయంగా మారింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV – మీతో 15 సంవత్సరాలు’ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు.
గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ సంగీత వేడుక రాత్రి వరకు అభిమానులను అలరించింది.
Anirudh Concert | ప్రేక్షకుల్లో ఉత్సాహం..
అనిరుధ్ తెలుగు, తమిళ హిట్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రత్యేక లైటింగ్ ఎఫెక్ట్స్, సౌండ్ సిస్టమ్, స్టేజ్ ప్రదర్శన అలరించడంతో కచేరీకి వచ్చిన యువత, సంగీతాభిమానులు మంత్ర ముగ్ధులయ్యారు. ప్రతి పాటకు ప్రేక్షకులు స్పందిస్తూ స్టేడియంను ఉత్సాహంతో నింపారు.
అనిరుధ్ సంగీత ప్రయాణానికి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తన కెరీర్‌లోని ప్రముఖ గీతాలను ప్రత్యక్షంగా వినిపిస్తూ అభిమానులతో తన ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు.
Anirudh Concert | ట్రాఫిక్ రద్దీ..
అనిరుధ సంగీత విభావరిని తిలకించేందుకు దాదాపు 30 వేల మంది టికెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో ఈ కచేరీ సందర్భంగా గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. పోలీసులు ముందస్తుగా ప్రకటించిన ట్రాఫిక్ సూచనల ప్రకారం కొన్ని మార్గాల్లో వాహనాలను దారి మళ్లించారు. దీంతో ఐఐఐటీ జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే మార్గాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రజా రవాణా వినియోగించిన వారికి కొంతవరకు సౌలభ్యం ఏర్పడింది.
టిక్కెట్లు ముందుగానే హౌస్‌ఫుల్ కావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. భద్రతా ఏర్పాట్లు సైతం కట్టుదిట్టంగా నిర్వహించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.

