అక్షరటుడే, హైదరాబాద్ : Leafy Vegetables | ఇటీవలి కాలంలో జంక్‌ఫుడ్ (Junk Food) వినియోగం పెరగడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు (Blood Pressure) వంటి అనారోగ్యాలు సర్వసాధారణం అవుతున్నాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే, మన ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఎన్నో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు నిండి ఉన్న ఈ ఆకుపచ్చని సంపదను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
ప్రతి ఆకుకూరలోనూ ప్రత్యేకమైన పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు:
ఆకుకూర పోషకాలు:
బచ్చలి కూర : దీనిలో ఉండే ఎ-విటమిన్, ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను నివారించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పొన్నగంటి : దీనిలో కాల్షియం అధికం ఉండి,శరీరంలో క్రిములను నశింపజేస్తుంది. వేడిని తగ్గించి ఎముకలకు బలం చేకూరుస్తుంది.
చుక్కకూర : ఇది గుండెను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
తోటకూర : దీనిలో గల కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) రక్తహీనత నుంచి ఉపశమనం కలిగించి, ఎముకలు దృఢంగా ఉంచుతుంది.
మెంతికూర : ఇది మధుమేహాన్ని అదుపు చేస్తుంది. ఊబకాయాన్ని తగ్గించి, గుండె, కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
సోయకూర : దీనిలో ఉండే సి-విటమిన్ రక్తహీనత నివారిస్తుంది.అలాగే రోగనిరోధక శక్తి పెరుగుదల, జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
మునగాకు : దీనిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు అనేక వ్యాధులను నివారించే శక్తివంతమైన ఆహారం అని చెప్పవచ్చు.
కొత్తిమీర : దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
కరివేపాకు : వెంట్రుకల (కురుల) సంరక్షణ, జీర్ణశక్తిని (అరుగుదల) పెంచుతుంది.
పుదీనా : దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
గోంగూర : హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది.చర్మ ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుదల, మంచి నిద్రకు సహాయపడుతుంది.
పాలకూర : దీనిలో ఎ-విటమిన్ అధికంగా ఉంటుంది.రోగనిరోధకశక్తి పెరుగుదల, ఎముకల దృఢత్వానికి సహకరిస్తుంది.
గంగపాయల : దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
క్యాబేజీ ఆకు : ఇది నరాల బలహీనతను నివారిస్తుంది. మధుమేహ రోగులకు చాలా మంచిది.
క్యాలీఫ్లవర్ ఆకు : దీనిలో కాల్షియం అధికంగా ఉండి ,ఎముకలు, దంతాలకు మేలు చేస్తుంది.
క్యారెట్ ఆకు : ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది, రక్తహీనతను నివారిస్తుంది.
చింతచిగురు : దీనిలో సి-విటమిన్ (Vitamin C) అధికం ఉండి రోగనిరోధకశక్తి పెరుగుదల, రక్తాన్ని శుద్ధి చేయడం, కాలేయానికి బలం, నోటికి రుచిని పెంచుతుంది.
చేమకూర : కిడ్నీలో రాళ్లను కరిగించే గుణం కలిగి ఉండి, కంటి సమస్యల నివారణకు తోర్పడుతుంది.
ఆకుకూరలు తినే విధానం :
వారానికి కనీసం రెండుసార్లు, వంద గ్రాముల ఉడికించిన ఆకుకూరలు తింటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్,ఖనిజాలు లభిస్తాయి. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆకుకూరలు తినడం అలవాటు చేయాలి.కేవలం కూర రూపంలోనే కాకుండా, పచ్చడి, పొడి, లేదా సలాడ్‌గా కూడా తీసుకోవచ్చు.అన్ని ఆకుకూరలను మార్చి మార్చి వండుకోవడం ద్వారా వేర్వేరు రుచులను ఆస్వాదించవచ్చు.
ఆకుకూరలు తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉంటాయి. కొద్దిగా శ్రద్ధ పెడితే ఇంటి పెరట్లో లేదా కుండీలలో కూడా సులువుగా పెంచుకోవచ్చు.


