అక్షరటుడే, నిజామాబాద్సిటీ: Arrive Alive Campaign | సమష్టి కృషితో ‘అరైవ్–అలైవ్’ను (Arrive Alive) విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలతో (DGP Shivadhar Reddy) వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వారు జిల్లా అధికారులతో సమీక్షించారు.
Arrive Alive Campaign | అధికారులపై గురుతర బాధ్యత..
వీసీ అనంతరం వారిరువురు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని (Traffic Awareness) పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందన్నారు. వార్డు సభ్యులు, సర్పంచ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలన్నారు.
13న అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. అదేవిధంగా రిటైర్డ్ టీచర్లు, డాక్టర్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కూడిన రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఈ కమిటీలో కనీసం ముగ్గురు మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు.
Arrive Alive Campaign | పాడుబడ్డ బావులు.. ముళ్లపొదలు..పిచ్చిమొక్కలు..
రహదారుల పక్కన పాడుబడిన బావులు ఉంటే పూడ్చివేయించాలని, ముళ్లపొదలు, పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ చేయించాలని తెలిపారు. 15న చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీడేగా జరపాలన్నారు. 16న అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారు ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, రవాణా శాఖ కమిషనర్ దుర్గాప్రమీల, డీఈవో అశోక్, డీఎంహెచ్వో రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
