అక్షరటుడే, బాన్సువాడ: ASHA Workers Demand | ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ఆశా కార్యకర్తలు వెళ్లారు. అయితే ఎమ్మెల్యే వర్ని మండల కార్యక్రమంలో ఉండటంతో, నిజామాబాద్ డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.
ASHA Workers Demand | అసెంబ్లీలో చర్చిస్తాం..
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తల సమస్యలను తప్పకుండా తన తండ్రి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చించేలా చూస్తానని హామీ ఇచ్చారు. సీఐటీయూ నాయకుడు జె.రవీందర్ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలకు గత రెండు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే వారికి బకాయి జీతాలు చెల్లించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్, మృతి చెందిన సందర్భంలో రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి సౌకర్యాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ASHA Workers Demand | 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు..
అసెంబ్లీ సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమానికి ఆశా కార్యకర్తలు అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బి.పల్లవి, సుమలత, విజయ, స్వరూప, కవిత, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.

