అక్షరటుడే, కామారెడ్డి: Bandi Sanjay Allegations | బాన్సువాడ పట్టణంలో ఇటీవల జరిగిన ఘటనలో ఎంఐఎం మెప్పు కోసమే అమాయకులను ప్రభుత్వం అరెస్టులు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. బాన్సువాడ ఘటనలో అరెస్ట్ అయి జైలులో ఉన్న బాధిత కుటుంబాలను జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Bandi Sanjay Allegations | డబ్బులు ఎలా పంపాలో రాహుల్‌గాంధీ నేర్పిస్తున్నారా..?
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే రూ.10 వేల కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపించవచ్చని, తెలంగాణలో రూ.వెయ్యి కోట్లు పంపించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అంటున్నారని తెలిపారు. నేడు రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ కార్యకర్తలకు డబ్బులు ఎలా వసూలు చేయాలో శిక్షణ ఇచ్చేందుకు వచ్చారా.. ఏ విషయంలో శిక్షణ ఇచ్చేందుకు వచ్చారో చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి హామీలు మరిచారన్నారు. తెలంగాణ ప్రజలపై అభిమానం ఉంటే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటే హైడ్రా కూల్చివేతలు, ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతలు, రాష్ట్రంలో దాడులకు గురైన దేవాలయాలను రాహుల్ గాంధీ (Rahul Gandhi) సందర్శిస్తే రేవంత్ రెడ్డి పాలన రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ప్రజలు చెప్తారని తెలిపారు.
Bandi Sanjay Allegations | కిరాణా సామగ్రి కొనేందుకు వస్తే అరెస్ట్‌లా..?
బాన్సువాడ (Banswada) ఘటనలో కిరాణా సామగ్రి కొనుగోలుకు వచ్చిన వ్యక్తిని పార్టీతో సంబంధం లేకున్నా కేవలం వీడియోలో కనిపించారని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారని బండి సంజయ్ మండిపడ్డారు. ఆ వ్యక్తి కుటుంబం ఈరోజు బోరున విలపిస్తుందని పేర్కొన్నారు. హోంశాఖ, విద్యాశాఖ సీఎం దగ్గరే ఉన్నాయని, ఆ శాఖల్లో ఏం జరుగుతుందో సీఎంకు సమాచారం రావడం లేదా..? వచ్చినా పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో ప్రభుత్వం సర్వే చేయించుకుందని, కూల్చివేతలు, దాడుల పట్ల ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, బీజేపీ (BJP)కి సానుకూలత ఉందని తేలిందన్నారు. దాంతో ఇప్పట్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉందన్నారు.
Bandi Sanjay Allegations | పూర్తిస్థాయి విచారణ జరపకుండానే..
బాన్సువాడలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా, వాస్తవాలు గ్రహించకుండా పోలీసు యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకోలేదని సంజయ్ ఆరోపించారు. ఎంఐఎం (MIM), ఒవైసీ బ్రదర్స్ (Owaisi Brothers) మెప్పు కోసం 17 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, పోలీసుల భయంతో 10-15 మంది పారిపోయారన్నారు. రాష్ట్రంలో హిందూసమాజం జాగృతం కావాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. హిందువులంతా రోడ్లపైకి చేరి ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మెడలు వంచాలని, ఇంకెన్నాళ్లు ఈ దాడులను భరిద్దామన్నారు. ఇవాళ దేవుళ్లపై దాడులు జరిగితే స్పందించని వాళ్లు హిందువులు కాదన్నారు.
Bandi Sanjay Allegations | అమాయక కుటుంబాలు రోధిస్తున్నాయి..
బాన్సువాడలో అమాయక కుటుంబాలు రోధిస్తున్నాయని, వారిని పరామర్శించేందు తమ నాయకులు వెళ్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తే హిందూసమాజం మాట్లాడడం లేదని కేంద్ర మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఏర్పడిన రెండేళ్లలో రాష్ట్రంలో అనేక దేవాలయాలు కూల్చేసిందన్నారు. తాను ఇతర మతంపై మాట్లాడడం లేదని, మసీదు, చర్చి కూల్చాలని చెప్పడం లేదన్నారు. తాను హోంమంత్రి అయినా ఒక హిందువుగా మాట్లాడుతున్నానని ఇలా మాట్లాడితే మతతత్వ వ్యక్తులుగా ముద్ర వేస్తారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో ఉన్న నాయకులు ఒక్కసారి గుండెపై చేయి వేసుకుని ఆలోచించాలని, ఈ ప్రభుత్వం హిందూసమాజం పట్ల వ్యవహరిస్తున్న తీరును గమనించాలని కోరారు. ఇన్ని దాడులు జరిగినా ఇంకా ఆ జెండాలు మోస్తే చరిత్రలో హిందు వ్యతిరేకులుగా, చరిత్ర హీనులుగా మిగిలిపోతారని తెలిపారు.
Bandi Sanjay Allegations | జెండాలు పక్కనబెట్టి హిందూధర్మం కోసం..
జెండాలు పక్కనబెట్టి హిందూధర్మం కోసం కాషాయ జెండా పట్టి ఏకం కావాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ (Narendra Modi) ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన కింద రూ.4కోట్ల ఇళ్లను నిర్మించిందని, శక్తివంతమైన దేశాన్ని నిర్మిస్తుందన్నారు. తెలంగాణలో మాత్రం హైడ్రా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేస్తుందన్నారు. హైడ్రా పేరుతో పెద్దల ఇళ్లపై బేరసారాలు చేస్తూ కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చేస్తుందని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. హైడ్రా అధికారులు, మీడియాతో తాము వస్తామని, బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో ఉన్న ఇళ్లను చూద్దామన్నారు. మూసి సుందరీకరణ పేరుతో, గాంధీ విగ్రహం పెడతామని పేదల ఇల్లు కూల్చేస్తారా అని ప్రశ్నించారు. ఇవాళ గాంధీ ఆత్మ క్షోభిస్తుందన్నారు. గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టి తాము ప్రజల నుంచి ప్రశంసలు పొందామని, తెలంగాణలో గాంధీ విగ్రహం పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలైందన్నారు. ఎఫ్టీఎల్లో ఉన్న ఫాతిమా కాలేజీ కూల్చాలని అడిగితే విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయని, అందుకే కూల్చడం లేదని చెప్పిన సీఎం ఖమ్మంలో ఇల్లు కూల్చడానికి వస్తే తమ పిల్లలకు పరీక్షలు ఉన్నాయని వేడుకున్నారని, అక్కడ విద్యార్థుల పరీక్షలు కనిపించలేదా అని నిలదీశారు. ఈ వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు.

Bandi Sanjay Allegations | రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు..
రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. పేదల ఇళ్ల జోలికి వెళ్తే అదే జేసీబీలతో తాము పెద్దల ఇళ్లపైకి వెళ్తామని హెచ్చరించారు. ఆ తర్వాత శాంతిభద్రతల సమస్య వస్తే ప్రభుత్వానికే నష్టమని పేర్కొన్నారు. గడిచిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన హామీలను అమలు చేయకున్నా ఓటేసి గెలిపించినందుకు బరితెగించారని, గల్లా ఎగిరేస్తున్నారన్నారు. 4వ తేదీన రైతు భరోసా ఇస్తామని చెప్పినా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో దానిపై కనీస చర్చ కూడా చేయలేదన్నారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా ఖర్చు మొత్తం తెలంగాణ రాష్ట్రమే భరిస్తుందని ఆరోపించారు. ఇవన్నీ ప్రశ్నించినందుకు బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేశారన్నారు. ఇవాళ కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులకు జరిగిన పరిస్థితే తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతుందని హెచ్చరించారు.
Bandi Sanjay Allegations | ముడుచుకుని కూర్చోలేం..
కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని, దాడులు చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోవడానికి తాము బీఆర్ఎస్ కార్యకర్తలం కాదన్నారు. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని, తాము తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులను ఇళ్ల నుంచి బయటకు రాలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం జరుగుతుందని, మంత్రులు సంపాదించుకుంటున్నారని, ఎమ్మెల్యేలను గ్రామాల్లో నిలదీస్తున్నారని తెలిపారు. అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంటే భారత్‌కు ఏ దేశంతో యుద్ధం వస్తుందో రాహుల్ గాంధీ చెప్పాలని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయని, బీజేపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bandi Sanjay Support | అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కేంద్ర మంత్రి బండి సంజయ్

