అక్షరటుడే, వెబ్‌డెస్క్: BCCI Contract Changes | ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాను (BCCI Contract Changes) విడుదల చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే ఈసారి బీసీసీఐ తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారి తీసింది. బీసీసీఐ తాజాగా 2025–26 సంవత్సరానికి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. ఇందులో గతంలో ఉన్న అత్యున్నత కేటగిరీ అయిన A+ గ్రేడ్‌ను పూర్తిగా తొలగించడం ప్రధాన అంశంగా మారింది. గతంలో ఈ A+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి సుమారు రూ.7 కోట్ల పారితోషికం లభించేది. ఇప్పుడు ఆ గ్రేడ్‌ను తొలగించడంతో గ్రేడ్ Aనే టాప్ కేటగిరీగా మారింది. ఈ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ.5 కోట్లు మాత్రమే అందనున్నాయి.
BCCI Contract Changes | బుమ్రాకే ఎందుకు తగ్గించారు..
ఈ మార్పు వల్ల టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు Bumrah నేరుగా ప్రభావం పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. గత ఏడాది వరకు బుమ్రా A+ గ్రేడ్‌లో ఉండి ఏడాదికి రూ.7 కోట్లు అందుకుంటుండగా, తాజా కాంట్రాక్ట్ ప్రకారం ఆయన గ్రేడ్ Aలోకి రావడంతో సుమారు రూ.2 కోట్ల వరకు ఆదాయం తగ్గే పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఈ నిర్ణయం బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు స్పందిస్తున్నారు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలక బౌలర్‌గా ఉన్న బుమ్రాకు జీతం తగ్గించడం సరైన నిర్ణయం కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పేసర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన బుమ్రా జట్టుకు వెన్నెముక లాంటి ఆటగాడని, అలాంటి ప్లేయర్‌కు ఇలా జరగడం అన్యాయం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
BCCI Contract Changes | గ్రేడ్ తగ్గించడం సహజమే..!
మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా Ravindra jadeja వంటి సీనియర్ ఆటగాళ్లు ప్రస్తుతం అన్ని ఫార్మాట్లు ఆడడం లేదని, అందువల్ల వారి గ్రేడ్ తగ్గించడం సహజమేనని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బుమ్రా మాత్రం మూడు ఫార్మాట్లలోనూ కీలక పాత్ర పోషిస్తున్నందున ఆయనకు ఈ మార్పు ప్రభావం పడడంపై చర్చ నడుస్తోంది.
అవసరమైతే మరికొన్ని మార్పులు
ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం. బుమ్రా వంటి స్టార్ ఆటగాడి జీతం ఒక్కసారిగా రూ.7 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గిపోవడం సరైన నిర్ణయం కాదని బోర్డు పెద్దలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కాంట్రాక్ట్ నిబంధనల్లో మార్పులు చేయడం లేదా ప్రత్యేక బోనస్ రూపంలో ఈ లోటును పూడ్చే మార్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక బుమ్రా మాత్రమే కాకుండా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ C గ్రేడ్‌కు పడిపోవడంపై కూడా బీసీసీఐలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే కాంట్రాక్ట్ వ్యవస్థలో మరికొన్ని మార్పులు చేయాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..

