అక్షరటుడే, వెబ్‌డెస్క్: BCCI ODI Plans | రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా టీ20 ఫార్మాట్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభించడంతో వన్డే మ్యాచ్‌లు తగ్గిపోయిన నేపథ్యంలో, ఇకపై టీమిండియా (Team India) మరిన్ని వన్డే మ్యాచ్‌లు ఆడేలా వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.
BCCI ODI Plans | బీసీసీఐ వ్యూహాలు
ఇటీవలి కాలంలో భారత జట్టు రెండు టీ20 ప్రపంచకప్‌లు మరియు ఒక ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా, 2011 తర్వాత వన్డే ప్రపంచకప్ మాత్రం భారత్‌కు అందని ద్రాక్షగానే మిగిలింది. ముఖ్యంగా 2023లో భారతదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్ వరకు అద్భుత ప్రదర్శన చేసి కూడా చివరికి ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. దీంతో దాదాపు 16 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్‌ను 2027లో తప్పకుండా గెలవాలనే లక్ష్యంతో బీసీసీఐ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
BCCI ODI Plans | రోహిత్, కోహ్లీలకి బెస్ట్ ఛాన్స్..
‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం, విదేశీ పర్యటనల్లో అదనపు వన్డే మ్యాచ్‌లు నిర్వహించేందుకు పలు దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐకు ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలకు బీసీసీఐ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇలా ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడటం ద్వారా జట్టులోని కీలక ఆటగాళ్లు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ పొందుతారని బోర్డు భావిస్తోంది. ప్రత్యేకంగా వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) మరియు రోహిత్ శర్మ వంటి వారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉండనుంది. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం ద్వారా వారి ఫామ్ మరియు ఫిట్‌నెస్ మెరుగుపడుతాయని, ప్రపంచకప్‌కు మెరుగైన సిద్ధత సాధ్యమవుతుందని బీసీసీఐ అంచనా వేస్తోంది.
BCCI ODI Plans | ఐపీఎల్ తర్వాత టీమిండియా బిజీ
ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా షెడ్యూల్ కూడా బిజీగా ఉండనుంది. ముందుగా భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లి అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో పాల్గొంటుంది. ఈ పర్యటనలోనే ఐర్లాండ్‌తో కూడా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా తమతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాలని బీసీసీఐను అభ్యర్థించినట్లు సమాచారం. అదేవిధంగా ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం భారత్ బంగ్లాదేశ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లతో కూడా సిరీస్‌లు ఆడనుంది. ముఖ్యంగా న్యూజిలాండ్ (New Zealand) తమ పర్యటనలో అదనపు వన్డే మ్యాచ్‌లు చేర్చాలని కోరినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, రాబోయే వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమిండియాకు ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడేలా బీసీసీఐ చేస్తున్న ఈ ప్రణాళికలు 2027లో భారత జట్టుకు విజయావకాశాలను మరింత పెంచుతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: IPL 2026 Schedule | ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్‌లో తలపడే జట్లు ఇవే..

