అక్షరటుడే, న్యూఢిల్లీ: Beer Price Hike | మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం తాజాగా భారతీయ వినియోగదారులపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా బీర్ తాగేవారికి కిక్కు దిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో త్వరలోనే బీర్ల ధరలు పెరగడంతో పాటు సరఫరాలో కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు Brewers Association of India (BAI) పేర్కొంది.
Beer Price Hike | ముడి సరకుల ధరల పెరుగుదల..
బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. తాజా అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బీరు తయారీకి అవసరమైన ముడి సరకుల ధరలు గణనీయంగా పెరిగాయి. యుద్ధ ప్రభావంతో తయారీ ఖర్చులు దాదాపు 12-15 శాతం వరకు పెరిగినట్లు సంస్థ వెల్లడించింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే బీర్ల విక్రయ ధరలు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ఉండటం మద్యం పరిశ్రమకు భారంగా మారిందని సంస్థ వివరించింది.
దీంతోపాటు బీర్ బాటిళ్ల ధరలు సుమారు 20 శాతం వరకు పెరిగాయి. ఇతర ముడి పదార్థాల రేట్లు కూడా 20-25 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. రవాణా ఖర్చులు సైతం 10 శాతం వరకు పెరగడంతో మొత్తం వ్యయం మరింతగా పెరిగింది.
Beer Price Hike | సరఫరాలో అంతరాయం..
బీర్ల సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న పలు కంపెనీలు కూడా ఈ పరిస్థితిని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. Carlsberg, United Breweries, AB InBev వంటి దిగ్గజ సంస్థలు కలిసి భారత్లో సుమారు 85 శాతం బీర్ విక్రయాలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా బీర్ ధరల పెంపు తప్పదని ఈ కంపెనీలు సంకేతాలు ఇస్తున్నాయి.

