అక్షరటుడే, కామారెడ్డి: Bhagavad Gita Record | భగవద్గీత పఠనంలో భిక్కనూరుకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు అద్భుత ప్రతిభ చూపారు. అరుదైన ‘ఎలైట్ వరల్డ్ రికార్డ్’ (Elite World Record India) సాధించారు. ఈ సందర్భంగా వారిని గురువారం ఎస్పీ రాజేష్ చంద్ర (SP rajesh Chandra) ప్రత్యేకంగా అభినందించారు.
Bhagavad Gita Record | భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు కుమారులు..
భిక్కనూరు (Bhiknoor) ఎస్సై ఆంజనేయులు కుమారులు కుశాల్ మనోహర్ యాదవ్, కార్తీక్ మనోహర్ యాదవ్ ఆధ్యాత్మిక రంగంలో అద్భుత ప్రతిభ చూపుతున్నారు. గత రెండేళ్లుగా ‘గీతా పరివార్’ (Gita Parivar) నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతుల ద్వారా శిక్షణ పొందుతూ.. భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో ఉన్న 700 శ్లోకాలను అనర్గళంగా కంఠతా నేర్చుకున్నారు. వీరి అకుంఠిత దీక్షకు గుర్తింపుగా గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన ‘గీతావ్రతి’గా గుర్తింపు పొందారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన ‘జ్ఞానస్మృతి’ కార్యక్రమంలో తమ ప్రతిభను చాటి ‘ఎలైట్ వరల్డ్ రికార్డ్’ సర్టిఫికెట్లు సాధించారు.
Bhagavad Gita Record | చిన్నారుల ప్రతిభను చూసి అబ్బురపడిన ఎస్పీ..
చిన్నారులు సాధించిన ఈ అరుదైన విజయాలను తెలుసుకున్న ఎస్పీ రాజేష్ చంద్ర అబ్బురపడ్డారు. వారిని జిల్లా పోలీస్ కార్యాలయానికి (Kamareddy News) పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఎస్పీ సమక్షంలో భగవద్గీత శ్లోకాలను స్పష్టంగా పఠించారు. చిన్నారులు పఠించిన శ్లోకాలను శ్రద్ధగా విన్న ఎస్పీ వాటి అర్థాలను అడిగి తెలుసుకోగా.. పిల్లలు ఆ శ్లోకాల అంతరార్థాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. చిన్నారుల ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని చూసి ఎస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వారిని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. అనంతరం ఆయన చిన్నారులకు స్వీట్లు తినిపించి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశీస్సులు అందజేశారు. చిన్న వయసులోనే ఇలాంటి ఉత్తమ మార్గంలో నడిపిస్తున్న తల్లిదండ్రులను అభినందిస్తూ, భవిష్యత్తులో ఈ చిన్నారులు ఉన్నత స్థాయికి ఎదిగి కన్నతల్లిదండ్రుల పేరుతో పాటు కామారెడ్డి జిల్లా పేరును కూడా దశదిశలా చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె నరసింహా రెడ్డి, భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.
Bhagavad Gita Record | దేశవ్యాప్తంగా ప్రశంసలు..
చిన్నారులు దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. గత ఏడాది జూన్లో శృంగేరి శారదా పీఠంలో (Sringeri Sharada Peetam) నిర్వహించిన గీతా జ్ఞాన యజ్ఞంలో పాల్గొని, జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారి ఆశీస్సులు, ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఇటీవల హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్వహించిన “సహస్ర గీతాపఠన” కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి వచ్చిన గీతా పాఠకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు బాబా రాందేవ్ (Baba Ramdev), అయోధ్య రామాలయ ట్రస్ట్ (Ayodhya Ram Temple Trust) కోశాధికారి గురు గోవింద్ గిరి చేతుల మీదుగా ప్రశంసలు అందుకొని జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టారు.
ఇది కూడా చదవండి: KTR Jeevan Reddy | కేసీఆర్, జీవన్ రెడ్డిల అనుబంధం ఇప్పటిది కాదు..: కేటీఆర్
