అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhu Bharati portal | భూ సమస్యల పరిష్కారానికి నూతన ఇంటిగ్రెటెడ్ వెబ్సైట్ ప్రారంభించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తెలిపారు. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, గతంలోని లోపాలను సరిదిద్ది సామాన్యులకు, రైతులకు భూ భద్రత కల్పించాలని భూ భారతి చట్టం తెచ్చామన్నారు.
భూ భారతి పోర్టల్‌లో రెవెన్యూ, సర్వే (Land Survey), రిజిస్ట్రేషన్ సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తూ నూతన ఇంటిగ్రేటెడ్ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలను గురువారం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం విటాయిపల్లిలో పొంగులేటి పోర్టల్‌ను ప్రారంభించారు.
Bhu Bharati portal | భూధార్ నంబర్
ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి భూయజమానికి వారి భూమికి ప్రత్యేకంగా భూధార్ (Bhudhar) నంబర్‌ను కేటాయిస్తామని పొంగులేటి తెలిపారు. దీంతో పారదర్శకత పెరిగి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ఇక నుంచి భూమి రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు క్షేత్రస్థాయి కొలతలతో కూడిన మ్యాప్‌ను కూడ జత చేస్తామన్నారు. అమ్మేవారి నుంచి కొనేవారికి భూమిని కొలిచి అప్పగించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని వెల్లడించారు.
Bhu Bharati portal | గొలుసు పద్ధతికి స్వస్తి
భూమి కొలతల సమయంలో పాతకాలపు గొలుసు పద్ధతులకు స్వస్తి పలకనున్నట్లు మంత్రి తెలిపారు. అంగుళం కూడా తేడా లేకుండా కొలతలు తీసే రోవర్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఇందుకోసం 5,300 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, మండలానికి 6 నుంచి 7 మందిని కేటాయించినట్లు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో భూ వివరాలను అప్‌లోడ్ చేస్తే 24 నుంచి 48 గంటల్లో సర్వేయర్ క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తారని చెప్పారు. వారం రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందుకోసం ప్రత్యేక జీవో తెచ్చినట్లు గుర్తు చేశారు. గతంలో మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయితీలకు ధరణిలో భూమి రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉండేది కాదన్నారు. భూభారతి ద్వారా ఈ అడ్డంకిని తొలగించి అన్ని ప్రాంతాల్లోనూ సేవలు అందుబాటులోకి తెచ్చామని పొంగులేటి తెలిపారు.
దీనిని కూడా చదవండి : IAS posting | ఐఏఎస్ అధికారి వాణిప్రసాద్‌కు పోస్టింగ్
