అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bilva Patra | శైవ సంప్రదాయంలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రం. శివలింగానికి బిల్వదళాలను సమర్పించడం వెనుక అపారమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యాలు ఉన్నాయని ప్రముఖ వేద పండితులు వివరిస్తున్నారు.
భక్తితో సమర్పించే ఒక్క బిల్వపత్రం భక్తుల పాపాలను హరించి, సకల శుభాలను కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సుందరాడ వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ బిల్వార్చనకు విశేష ప్రాధాన్యత ఇస్తారు.
Bilva Patra | త్రిమూర్తి తత్వానికి ప్రతీక:
బిల్వపత్రం అంటే మూడు ఆకుల సమాహారం. ఈ మూడు ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపానికి సంకేతమని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా మనిషిలోని సత్వ, రజ, తమో గుణాలను నియంత్రించుకుని శివతత్వంలో లీనమవ్వాలనే సందేశాన్ని ఇవి అందిస్తాయి. ఈ ఆకులపై ఉండే నాడులు పరమశివుని త్రినేత్రాలకు ప్రతిరూపాలుగా భావిస్తారు.
Bilva Patra | లక్ష్మీదేవి నివాసం.. ఐశ్వర్య కారకం:
స్కంద, శివ పురాణాల ప్రకారం బిల్వ వృక్షం సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసస్థానం. అందుకే శివలింగాన్ని బిల్వపత్రాలతో అర్చిస్తే కేవలం మోక్షమే కాకుండా.. ఐశ్వర్యం, ఆరోగ్యం, ప్రశాంతత లభిస్తాయి. ఒక్క బిల్వపత్రంతో పూజించినా వెయ్యి కమలాలతో పూజ చేసినంత ఫలితం దక్కుతుందని పురాణోక్తి. మహాశివరాత్రి, సోమవారాలు, ప్రదోష కాలాల్లో చేసే బిల్వార్చనకు విశేష ఫలితం ఉంటుంది.
పూజలో పాటించాల్సిన నియమాలు:
శివార్చనలో వాడే బిల్వపత్రం స్వచ్ఛంగా, పచ్చగా ఉండాలి. పురుగులు కుట్టినవి లేదా చినిగిన ఆకులను పూజకు వాడకూడదు. ఆకులను కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, కత్తిరించకుండా కోయాలి. బిల్వదళాన్ని సమర్పించేటప్పుడు కాడ భాగం శివలింగం వైపు ఉండేలా ఉంచడం మన ఆచారం.
ఆరోగ్య ప్రదాయిని.. ఆయుర్వేద గని:
ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ బిల్వ వృక్షానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. జ్వరం, జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు బిల్వపత్రాలు అద్భుత ఔషధంగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ప్రకృతితో మమేకమైన శివారాధనలో భాగంగానే మన పెద్దలు ఈ పత్రాలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.
ఇది కూడా చదవండి: Karna | కర్ణ మరణం నుంచి కష్టాల వరకు.. ‘సవాలక్ష’ అనే పదం ఎలా వచ్చిందంటే!
