అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bolivia Air Force Crash | బొలీవియాలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రద్దీగా ఉండే రహదారిపై బొలీవియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
Bolivia Air Force Crash | ఎల్ ఆల్టో నగరంలో
బొలీవియా రాజధాని లా పాజ్‌కు ఆనుకుని ఉన్న ఎల్ ఆల్టో నగరంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. సౌత్ అమెరికన్ – గ్లోబల్ డిఫెన్స్ డెవలప్‌మెంట్‌లను ట్రాక్ చేసే SA డిఫెన్సా యొక్క X పోస్ట్ ఈ ప్రమాద ఘటనను షేర్ చేసింది. విమానాశ్రయం సమీపంలో బొలీవియన్ ఎయిర్ ఫోర్స్ C-130 హెర్క్యులస్ కూలిపోయిందని సదరు పోస్ట్ వెల్లడించింది.
Bolivia Air Force Crash | విమానం రన్‌వే నుంచి జారిపోయి..
సైనిక హెర్క్యులస్ విమానం శాంటా క్రజ్ నుంచి బయలుదేరింది. ఇది కొత్తగా ముద్రించిన నోట్లను రవాణా చేస్తోంది. విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వే నుంచి పక్కన వీధిలోకి జారిపోయిన తర్వాత కూలిపోయిందని స్థానిక ప్రసార సంస్థ యూనిటెల్ పేర్కొంది. కనీసం 15 మంది మరణించారని అగ్నిమాపక అధికారి పావెల్ తోవర్ తెలిపారు. కానీ, మరణించిన వారిలో ప్రయాణికులు ఉన్నారా..? లేక హైవేపై ఉన్నవారా..? అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
Bolivia Air Force Crash | భయానక దృశ్యాలు..
సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. రోడ్డుపై కొత్త నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని రాయిటర్స్ వెల్లడించింది. ఒక అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మరోవైపు మరికొందరు చెల్లాచెదురుగా ఉన్న నగదును తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు క్లిప్పింగ్స్ ఉన్నాయి. దీంతో స్థానిక అధికారులు జనాన్ని చెదరగొట్టడానికి నీటి గొట్టాలను ప్రయోగించినట్లు తెలుస్తోంది.
స్థానిక మీడియా ప్రసారం చేసిన చిత్రాల్లో విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు, ప్రమాదం జరిగిన రహదారిపై వాహనాలు శిథిలమైనట్లు ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తును అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు!

