అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bottle Gourd Benefits | నేటి ఆధునిక జీవనశైలిలో ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఈ అనారోగ్యాలకు చెక్ పెట్టేందుకు ఆయుర్వేద నిపుణులు సొరకాయను ఒక “ఫ్రెండ్లీ వెజిటబుల్”గా సిఫార్సు చేస్తున్నారు. తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నామని ఆందోళన చెందేవారికి, ఉద్యోగ వ్యాపారాల రీత్యా అధిక కార్బోహైడ్రేట్లు తీసుకునే వారికి ఇది ఒక అద్భుత పరిష్కారం.
Bottle Gourd Benefits | పోషకాల గని:
చాలామంది దీనిని కేవలం “పసరు కూరగాయ”గానో లేదా రోగులు తినే ఆహారంగానో భావిస్తారు. కానీ దీనిలోని ఆరోగ్య రహస్యాలు అపారం. 100 గ్రాముల సొరకాయలో 96 శాతం మినరల్స్‌తో కూడిన నీరే ఉంటుంది. కేవలం 12 క్యాలరీలు, 2.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి ఉత్తమమైన ఆహారం.
అర కిలో సొరకాయ కూర తిన్నా కేవలం 60 క్యాలరీలే లభిస్తాయి, ఇది పాలు-పంచదార కలిపిన ఒక కప్పు కాఫీ కంటే చాలా తక్కువ. ఇది ఆకలిని నియంత్రించి, త్వరగా పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
Bottle Gourd Benefits | మధుమేహం:
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో (పుల్కాతో కలిపి) సొరకాయను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది సహజసిద్ధమైన ‘డైయూరిటిక్’ లక్షణాలను కలిగి ఉండి మూత్రవిసర్జనను పెంచుతుంది.
తద్వారా శరీరంలోని అధిక నీరు, వ్యర్థాలు బయటకు పోయి, యూరినరీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ల సమస్యలు తగ్గుతాయి. శరీరంలో క్షార స్వభావాన్ని (Alkalinity) పెంచి అసిడిటీ, కడుపులో మంట, అల్సర్ వంటి ఇబ్బందులను ఇది దూరం చేస్తుంది.
సురక్షితమైన రసాయన రహిత ఆహారం:
మరో విశేషమేమిటంటే, సొరకాయకు సహజంగానే పురుగులు పట్టవు కాబట్టి వీటికి పురుగుల మందులు లేదా ఎరువుల అవసరం పెద్దగా ఉండదు. ఇది మనకు లభించే అత్యంత సురక్షితమైన, రసాయన రహిత ఆహారం.
దీనిని కేవలం సాంబార్‌కే పరిమితం చేయకుండా, నిత్యం కూరగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. లేత కాయ అయితే తొక్క తీయకుండానే వాడవచ్చు. చిన్నపిల్లలకు కూడా దీనిని అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యల నుండి వారిని కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Gold Jewelry Buying | నగలు రెడీమేడ్ తీసుకోవాలా..? చేయించాలా..? నిపుణులు ఏమంటున్నారంటే!
