అక్షరటుడే, వెబ్డెస్క్ : Bride Elopes Wedding | ఎన్టీఆర్ జిల్లా (NTR District) మైలవరంలో (Mailavaram) ఓ వివాహ వేడుకలో చోటు చేసుకున్న అనూహ్య ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో ఘనంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో మాంగల్యధారణకు క్షణాల ముందు వధువు తన ప్రియుడితో వెళ్లిపోవడం కలకలం రేపింది. స్థానిక సమాచారం ప్రకారం, మైలవరానికి చెందిన ఓ యువతి వివాహం కుటుంబ సభ్యులు నిర్ణయించిన వరుడితో ఘనంగా జరుగుతోంది. పెళ్లి మండపం వద్ద బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై వివాహ వేడుకలో పాల్గొన్నారు. ముహూర్తం సమయం దగ్గరపడడంతో సంప్రదాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
Bride Elopes Wedding | అందరి ముందే ప్రకటన..
ఇదే సమయంలో అనూహ్యంగా ఓ యువకుడు మండపం వద్దకు వచ్చాడు. అతడిని చూసిన వెంటనే వధువు పీటలపై నుంచి లేచి అతడి దగ్గరకు వెళ్లింది. “వచ్చావా?” అంటూ అతడితో మాట్లాడిన ఆమె, అందరి ముందు అతడే తన ప్రేమికుడని ప్రకటించింది. “ఇతను మా ఊరివాడే.. మేమిద్దరం చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం” అని చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఏమి జరుగుతోందో అర్థం కాక నిశ్చేష్టులయ్యారు.

Bride Elopes Wedding | యువకుడిపై దాడి
ఈ పరిణామంతో వరుడి తరఫు బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. పెళ్లి మండపానికి వచ్చిన ఆ యువకుడిపై కొందరు చేయి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పే అవకాశముండడంతో సమాచారం అందుకున్న పోలీసులు (Police) అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక వరుడి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొడుకు పెళ్లి కోసం దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు చేశామని, చివరి నిమిషంలో ఇలా జరిగి తమ కుటుంబ పరువు పోయిందని వాపోయారు.
పెళ్లి ఆగిపోవడంతో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. చివరకు గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాలు పంచాయితీ నిర్వహించుకుని విషయాన్ని చర్చించుకున్నాయి. పరిస్థితి సమసిపోయేలా గ్రామ పెద్దలు మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. మాంగల్యధారణకు క్షణాల ముందు వధువు తన ప్రియుడితో వెళ్లిపోవడం మైలవరం ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన గురించి గ్రామస్థులు, స్థానికులు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు.

