అక్షరటుడే, న్యూఢిల్లీ: Crude Oil Prices | ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు మూడో వంతు హర్మూజ్ జలసంధి Strait of Hormuz మీదుగానే రవాణా అవుతోంది. ఇరాన్ యుద్ధంతో ఇక్కడ ఏర్పడిన అంతరాయం వల్ల చమురు రవాణా నౌకలపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీంతో ఏప్రిల్ కాంట్రాక్ట్ ధరలు బ్యారెల్‌కు సుమారు 10 శాతం పెరిగినట్లు ట్రేడింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Crude Oil Prices | భారత్‌పై ప్రభావం భారీగానే..
భారత దేశం తన అవసరాల్లో దాదాపు 85 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. నిపుణుల అంచనాల ప్రకారం పరిశీలిస్తే.. బ్యారెల్ ధరలో ఒక్క డాలర్ పెరిగినా భారత దేశంపై ఏటా సుమారు రూ.13 వేల కోట్ల అదనపు భారం పడే ప్రమాదం ఉంది.
చమురు ధరల పెరుగుదల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. దీంతో రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. తద్వారా నిత్యావసర సరకులు, కూరగాయలు, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు సైతం పెరగవచ్చు. దీంతో మళ్లీ ద్రవ్యోల్బణం సమస్య తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Crude Oil Prices | గ్లోబల్ మార్కెట్ల కలకలం
చమురు ధరల పెరుగుదలతో స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. పెట్టుబడిదారులు భద్రమైన పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు. యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉండటంతో మార్కెట్లలో నిరంతరం అస్థిరత కొనసాగవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తీవ్ర ఆందోళన
చమురు ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై భారీగానే భారం పడవచ్చనే చర్చలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఇంధన ధరలు పెరిగితే అన్ని రంగాలపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు చల్లారకపోతే అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా పడబోతుందనే దానిపై ఆందోళన నెలకొంది.

