అక్షరటుడే, కామారెడ్డి: Cyber Crime Legal Aid | సైబర్ నేరగాళ్ల భారినపడి.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న బాధితుల కోసం ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Cyber Crime Legal Aid | కామారెడ్డి జిల్లా పరిధిలో..
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా (Kamareddy District) పరిధిలో సైబర్ నేరాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం, జిల్లా న్యాయ విభాగం సంయుక్తంగా కీలక చర్యలు చేపట్టాయి. ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ సైబర్ క్రైం బాధితులకు ఉచిత ప్రభుత్వ న్యాయ సహాయం అందించాలని నిర్ణయించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు కోల్పోయిన బాధితులు, ఆ నగదును తిరిగి పొందే ప్రక్రియలో భాగంగా సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
Cyber Crime Legal Aid | ఆర్థికంగా వెనుకబడిన వారు..
అయితే.. ఆర్థికంగా వెనుకబడిన వారు లేదా ప్రైవేట్ న్యాయవాదులను సంప్రదించే స్థోమత లేని బాధితుల కోసం ప్రభుత్వం తరఫున ఉచితంగా ‘లీగల్ ఎయిడ్ అడ్వకేట్’ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. బాధితులు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ న్యాయవాది (Government Lawyer) ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి తమ సొమ్మును తిరిగి పొందే చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సైబర్ నేరాల వల్ల నగదు నష్టపోయి, ఆ మొత్తం బ్యాంక్ ఖాతాలలో ఫ్రీజ్ అయి ఉన్న బాధితులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోలీస్ శాఖ (District Police Department) కోరింది. ఈ ప్రక్రియపై మరిన్ని వివరాల కోసం బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 15100 లేదా తమ సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా జిల్లా సైబర్ క్రైం సెల్‌ను సంప్రదించాలని సూచించింది.
ఇది కూడా చదవండి..: Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి

