అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dalal Street Black Monday | పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని మూసి వేయడంతో చమురు సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడ్డాయి. పలు దేశాలు ముడి చమురు ఉత్పత్తిని నిలిపివేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి.
ఈ క్రమంలో ముడి చమురు ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ఇంట్రాడేలో బ్యారెల్‌కు గరిష్టంగా 119.14 డాలర్లకు చేరింది. 2022 తర్వాత ఇదే అత్యధికం. బ్యారెల్‌కు 150 డాలర్ల వరకు పెరిగే అవకాశాలున్నాయన్న భయాలతో ఇన్వెస్టర్లు ఒత్తిడికి గురయ్యారు. దీంతోపాటు క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర పెరుగుతుండడం, రూపాయి విలువ పతనమవుతుండడం, విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉండడంతో మన మార్కెట్లు పతనమయ్యాయి.
Dalal Street Black Monday | భారీ నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 1,862 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 632 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 582 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 171 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు మార్కెట్లు భారీ నష్టాలతో సాగాయి. అయితే చమురు ధరలను నియంత్రించేందుకు జీ7 దేశాలు చర్యలు తీసుకుంటున్నాయన్న వార్తలతో మార్కెట్లు కోలుకున్నాయి. వ్యూహాత్మక నిల్వలనుంచి 400 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వలను విడుదల చేసే విషయాన్ని జీ7 దేశాలు పరిశీలిస్తున్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధర కాస్త శాంతించింది. చివరికి బ్యారెల్‌కు 104.70 డాలర్ల వద్ద స్థిరపడింది. ముడిచమురు ధరలనుంచి ఉపశమనం లభించడంతో సూచీలు కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్ 1,287 పాయింట్లు, నిఫ్టీ 381 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 1,352 పాయింట్ల నష్టంతో 77,566 వద్ద, నిఫ్టీ 422 పాయింట్ల నష్టంతో 24,028 వద్ద స్థిరపడ్డాయి.
Dalal Street Black Monday | 2024 తర్వాత ఇంట్రాడేలో అతిపెద్ద పతనం..
దేశీయ స్టాక్ మార్కెట్లు 2024 జూన్ 4 తర్వాత పాయింట్ల పరంగా రెండో అతిపెద్ద పతనాన్ని నమోదు చేశాయి. అప్పట్లో ప్రధాన సూచీలు 5.7 శాతం నష్టపోయాయి. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో సెన్సెక్స్ 4,390 పాయింట్లు, నిఫ్టీ 1,380 పాయింట్లు పడిపోయాయి. సోమవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,494 పాయింట్లు, నిఫ్టీ 753 పాయింట్లు కోల్పోయాయి.

Dalal Street Black Monday | అన్ని సెక్టార్లలో రక్తపాతం
అన్ని సెక్టార్ల స్టాక్స్ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ (Nifty) ఆటో ఇండెక్స్ 4.10 శాతం, బ్యాంక్ నిఫ్టీ 3.05 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.68 శాతం, మెటల్ ఇండెక్స్ 2.60 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.49 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.37 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.15 శాతం నష్టపోగా.. ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, టెలికాం, మీడియా, యుటిలిటీ, రియాలిటీ, పవర్ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా నష్టంతో ముగిశాయి. ఐటీ ఇండెక్స్ మాత్రమే 0.08 శాతం పెరిగింది.
Dalal Street Black Monday | ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి..
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరలు సృష్టిస్తున్న కల్లోలంతో గ్లోబల్ మార్కెట్లన్నీ (Global Markets) నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. అత్యధికంగా సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 6.34 శాతం పతనవమగా.. జపాన్ నిక్కీ 5.48 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 4.64 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.93 శాతం హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.53 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.67 శాతం నష్టంతో ముగిశాయి. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 2.10 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.67 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 1.31 శాతం, అమెరికాకు చెందిన డౌజోన్స్ ఫ్యూచర్స్ 1.26 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

