అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Bomb Threat | ఢిల్లీలోని పలు ప్రాంతాలకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎర్రకోట, సచివాలయంతో పాటు పలు పాఠశాలలకు బెదిరింపులు రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఎర్రకోట, ఢిల్లీ సచివాలయానికి సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీనితో భద్రతా సంస్థలు తనిఖీలు చేపట్టాయి. ఢిల్లీ సచివాలయానికి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు అగ్నిమాపక శాఖకు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టగా అనుమానాస్పద వస్తువులు దొరకలేదు.
Delhi Bomb Threat | పాఠశాలలకు..
ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్‌లోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్‌కు బెదిరింపులు రావడంతో పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లతో సహా భద్రతా సంస్థలు రెండు పాఠశాల ప్రాంగణాల్లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని పోలీసులు తెలిపారు.
పంజాబీలో రాసిన ఈమెయిల్లో ఖలిస్తాన్ గురించి ప్రస్తవించారు. విధానసభ, ఎర్రకోట, ఢిల్లీ మెట్రో స్టేషన్ల గురించి కూడా ఇందులో ప్రస్తావించారని, అయితే పేర్లు అస్పష్టంగా ఉన్నాయని అధికారి తెలిపారు.
Delhi Bomb Threat | పాఠశాలలకు బాంబు బెదిరింపులు
ఇటీవల దేశ రాజధాని, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నగరంలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు బాగా పెరిగాయి. దేశవ్యాప్తంగా కోర్టులకు కూడా ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. దీంతో పోలీసులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందులో చాలా వరకు నకిలీ బెదిరింపులు ఉంటున్నాయి. కానీ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.

