అక్షరటుడే, కామారెడ్డి: Devunipalli Fire Accident | అకస్మాత్తుగా మంటలు వ్యాపించి ఫర్నిచర్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. అలాగే షాప్ పైన ఉన్న ఇల్లు కూడా ధ్వంసమైంది. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. దేవునిపల్లి గ్రామం (Devunipalli Village)లోని 12వ వార్డులో వడ్ల బాల్చంద్రం 30ఏళ్లుగా తన కుమారులతో కలిసి ఇంటి కింద భాగంలో కార్పెంటర్ షాపు నడుపుతూ పైన ఉంటున్నారు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి పనులు ముగించుకుని ఇంట్లోకి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున 4:30 సమయంలో పొగ రావడాన్ని బాల్చంద్రం గమనించాడు. కాసేపటికే మంటలు వ్యాపించడంతో ఎదురుగా ఉన్నవాళ్లు చూసి అప్రమత్తమయ్యారు. అప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్నవాళ్లు కిందకు వచ్చారు. ఇంట్లో ఉన్న ముఖ్యమైన సామగ్రిని కిందకు తెచ్చారు. ఈ క్రమంలో బాలచంద్రం భార్య శారదకు మంటల ధాటికి చేతికి, కాలికి స్వల్ప గాయాలయ్యాయి.

Devunipalli Fire Accident | మిషన్లు దగ్ధం..
కార్పెంటర్ షాపు (Carpenter Shop)లో ఫర్నిచర్ భారీగా ఉండటంతో మంటలు దట్టంగా వ్యాపించి ఫర్నిచర్, కార్పెంటర్ మిషన్లు కాలిపోయాయి. భారీగా మంటలు వ్యాపించడంతో ఇంటి పైభాగానికి మంటలు తగిలి ఇంటికి క్రాక్స్ ఏర్పడ్డాయి. ఫ్లోరింగ్ పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో నలుగురు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫైరింజన్ సమయానికి రావడంతో పెనుప్రమాదం తప్పింది. మంటలు ఇంట్లోకి వ్యాపించి ఉంటే ప్రాణనష్టం సంభవించేదని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును జిల్లా ఫైర్ అధికారి సుధాకర్ పరిశీలించారు. మంటల ధాటికి ఇల్లు డ్యామేజీ జరగిందన్నారు. ఇంజినీర్ సలహా తీసుకున్న తర్వాతే ఇంట్లోకి రావాలని కుటుంబ సభ్యులకు సూచించారు. స్థానిక కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి అక్కడే ఉండి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తమకు జీవనాధారమైన ఫర్నిచర్ షాపు దగ్ధం కావడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇటీవలే రూ.15 లక్షల విలువైన ఫర్నిచర్ తీసుకువచ్చి షాపులో ఉంచినట్టుగా పేర్కొన్నారు. అగ్నిప్రమాదం (Fire Accident)తో సుమారు రూ.60 లక్షల నుంచి 70 లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: EAPCET Coaching Classes | ఏబీవీపీ ఇందూర్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్ శిక్షణ తరగతులు ప్రారంభం
