అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump Health | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక సమావేశాలతో బిజీగా ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ట్రంప్‌కు ఏమైంది?” అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి 19న వైట్ హౌజ్(White House)లోని ఈస్ట్ రూమ్‌లో జరిగిన మెడల్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలలో ఆయన మెడపై ఎర్రటి మచ్చలు స్పష్టంగా కనిపించాయి. ఈ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
Donald Trump Health | వైట్ హౌస్ స్పందన
ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన ఆలస్యంగా వచ్చినప్పటికీ, వైట్ హౌస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. ట్రంప్ తన మెడకు ఒక సాధారణ “ప్రివెంటివ్ స్కిన్ క్రీమ్” ఉపయోగిస్తున్నారని, దాని ప్రభావం వల్లే చర్మం ఎర్రగా మారిందని తెలిపారు. ఈ ఎర్రదనం తగ్గేందుకు కొన్ని వారాలు పట్టవచ్చని పేర్కొన్నారు. ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బబెల్లా కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదని స్పష్టం చేశారు. అయితే ట్రంప్‌కు ఖచ్చితంగా ఏ చర్మ సమస్య ఉందన్న విషయంపై వివరాలు వెల్లడించలేదు.
ట్రంప్ వయస్సు ప్రస్తుతం 79 సంవత్సరాలు. అధ్యక్షుడిగా ఆయన ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక నిఘా ఉంటుంది. గతంలో ఆయన చేతులపై కూడా ఎర్రటి మచ్చలు కనిపించాయి. ఆ సమయంలో ట్రంప్ స్వయంగా స్పందిస్తూ, తాను రక్తాన్ని పల్చగా ఉంచేందుకు ఆస్పిరిన్ మాత్రలు ఎక్కువగా వాడుతున్నానని తెలిపారు. అందువల్ల షేక్‌హ్యాండ్ ఇచ్చినప్పుడు చర్మం త్వరగా కమిలిపోతుందని వివరణ ఇచ్చారు. ఇదిలాఉండగా, గత ఏడాది ఆయనకు “క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ” అనే సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సమస్యలో కాళ్లలో రక్తప్రసరణ సరిగా లేక వాపు రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న మెడపై ఎర్రటి మచ్చలతో ఆ సమస్యకు సంబంధం లేదని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి.
Donald Trump Health | ట్రంప్ ఆరోగ్య సమస్య
ట్రంప్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో (Social Media) విభిన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. కొందరు ఇది సాధారణ చర్మ సమస్యేనని భావిస్తుండగా, మరికొందరు దీని వెనుక మరేదైనా కారణం ఉందేమోనని అనుమానిస్తున్నారు. అయితే అధికారికంగా ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదని వైట్ హౌస్ స్పష్టం చేయడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. ప్రస్తుతం ట్రంప్ తన అధికారిక కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి అత్యవసర పరిస్థితి లేదని అధికారులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..: Trump Iran War Comments | యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

