అక్షరటుడే, కామారెడ్డి: Drunk Drive Fines Kamareddy | మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు పదేపదే చెబుతున్నా, అవగాహన కల్పిస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా ప్రతిరోజు పదుల సంఖ్యలో పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడుతున్నారు.
Drunk Drive Fines Kamareddy | తాజాగా ఒకేరోజు..
ఇప్పటికే వేలాది మందికి జరిమానాలు, వందల మందికి జైలుశిక్షలు విధిస్తూ కోర్టు తీర్పులు చెప్పింది. తాజాగా ఒకేరోజు 525 మందికి శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) నివారించడంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో భారీ సంఖ్యలో వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పట్టుబడిన 525 మందిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలను విధించింది. ఈ క్రమంలో మొత్తం 525 మందికి శిక్షలు పడగా, అందులో 40 మందికి ఒక రోజు, నలుగురికి రెండు రోజులు, 9 మందికి 5 రోజులు, ముగ్గురికి 7 రోజుల పాటు జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తు కోర్టు తీర్పునిచ్చింది.
Drunk Drive Fines Kamareddy | రూ.4లక్షలకు పైగా జరిమానాలు..
వీరితో పాటు మిగతా వారికి కలిపి మొత్తం రూ.4,92,400 జరిమానా విధించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, బాధ్యతారాహిత్య చర్యలను అరికట్టడానికి పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం అనేది కేవలం చట్టరీత్యా నేరం మాత్రమే కాదని, అది ఒక ప్రాణాంతక నిర్ణయమని స్పష్టం చేశారు. ఒక్కరి నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండటం అనేది కేవలం చట్టానికి భయపడి చేసే పని కాదని, అది మన సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ఇంకా కఠినంగా కొనసాగుతాయని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి : Geo Spatial Technology India | జియో విద్యార్థులకు NIRDలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు: ప్రొఫెసర్ ఎం.వి. రవిబాబు

