అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dubai Iran Attacks | గల్ఫ్ దేశాల్లోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ (Iran) దాడులు చేస్తోంది. దుబాయి, దోహా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, కువైట్, జోర్డాన్, సౌదీలోని యూఎస్ సైనిక స్థావరాలపై క్షిపణులు ప్రయోగించింది. దీంతో దుబాయిలో ఎయిర్‌పోర్టు మూసివేశారు. పలువురు భారతీయులు, సినీ, క్రీడా ప్రముఖులు ఆ దేశంలో చిక్కుకుపోయారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) చిక్కుకుపోయారు. అక్కడ పరిస్థితులపై ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తాము ఉన్న ప్రాంతానికి సమీపంలో పేలుడు చోటు చేసుకుందన్నారు. ప్రాణభయంతో పరుగులు తీశామని పేర్కొన్నారు. అక్కడ పరిస్థితులు భయానకంగా మారుతున్నాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం తామంతా సేఫ్‌గా ఉన్నట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టులోని సిబ్బంది, అధికారులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Dubai Iran Attacks | పూణేకు చెందిన విద్యార్థులు
పూణేకు చెందిన 84 మంది MBA విద్యార్థులు దుబాయిలో చిక్కుకుపోయారు. ఇందిరా స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ (ISBS) విద్యార్థులు వార్షిక పర్యటనలో భాగంగా దుబాయ్ వెళ్లారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో వారు అక్కడే ఉండిపోయారు. అయితే తమ విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్లు సంస్థ తెలిపింది. వారిని అక్కడ ఓ హోటల్‌కు అధికారులు తరలించినట్లు చెప్పింది. వీలైనంత త్వరలో వారు ఇండియాకు వస్తారని పేర్కొంది.
Dubai Iran Attacks | మై ఫ్యామిలీ సేఫ్
తెలుగు హీరో మంచు విష్ణు (Manchu Vishnu) సైతం ప్రస్తుతం దుబాయిలో ఉన్నారు. తన ఫ్యామిలీని కలవడానికి ఆయన అక్కడకు వెళ్లారు. అయితే ఇరాన్ ఆ దేశంపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. యూఏఈ వాటిని అడ్డుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఉంటున్న ప్రదేశం పేలుళ్ల శబ్ధంతో దద్దరిల్లుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన కుటుంబం సేఫ్‌గా ఉందని ప్రకటించారు.
పర్యాటక రంగానికి దెబ్బ
దుబాయిను నిత్యం ఎంతో మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఆ దేశానికి చమురుతో పాటు పర్యాటకం ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. ఈ క్రమంలో తాజా పరిస్థితులు ఆ దేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఒకప్పుడు దుబాయ్ సేఫ్ ప్లేస్ అనుకునే వారు. అలాంటి దేశంలో కూడా నేడు బాంబుల వర్షం కురుస్తుండటంతో ప్రజలు, పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయో తెలియడం లేదు.

