అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Egypt Fuel Crisis | ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ (America-Israel) యుద్ధంతో తలెత్తిన ఇంధన సంక్షోభం దృష్ట్యా దుకాణాలు, రెస్టారెంట్లను రాత్రి 9 గంటలకల్లా మూసివేయాలని ఈజిప్టు (Egypt) ఆదేశించింది. దుకాణాలు, మాల్స్, రెస్టారెంట్లను ఒక నెల పాటు ముందుగానే మూసివేయాలని ఈజిప్టు ఆదేశించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పలు దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాల్లో ఇంధన రేట్లను పెంచారు. తాజగా ఈజిప్ట్ సైతం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాక్షికంగా ఇంటి నుంచే పని చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని మోస్తఫా మద్బౌలీ (Mostafa Madbouly) తెలిపారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడమే ఈ చర్యల లక్ష్యమని పేర్కొన్నారు.
Egypt Fuel Crisis | ప్రపంచ సంక్షోభం
ఇరాన్, ఇజ్రాయెల్–అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తి, రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. దీనిపై ఈజిప్ట్ ప్రధాని మాట్లాడుతూ.. ఒక అసాధారణమైన ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని తెలిపారు. దీని పర్యవసానాలు ప్రపంచం మొత్తం మీద తీవ్రంగా ఉంటాయన్నారు. యుద్ధానికి ముందు నెలకు 560 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈజిప్టు సహజ వాయువు దిగుమతుల బిల్లు, ప్రస్తుతం 1.65 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గురు, శుక్రవారాలు మినహా మిగతా అన్ని రోజులు దుకాణాలు, మాల్స్, రెస్టారెంట్లు రాత్రి 9 గంటలకే మూసి వేయాలని ఆదేశించారు. ఈ చర్యలు మార్చి 28 నుంచి నెల రోజుల పాటు అమలులో ఉంటాయన్నారు.
Egypt Fuel Crisis | వాటికి విద్యుత్ నిలిపివేత
విద్యుత్‌ను ఆదా చేసేందుకు రోడ్డు పక్కన ఉండే ప్రకటనల లైటింగ్‌ను నిలిపివేయాలని ప్రధాని ఆదేశించారు. రాజధానిలోని ప్రభుత్వ జిల్లా కార్యాలయాలు సాయంత్రం 6 గంటలకే మూసి వేస్తామన్నారు. ఫ్యాక్టరీలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ఉత్పత్తి సంబంధిత రంగాలను మినహాయించి, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వారానికి ఒకటి లేదా రెండు రోజులు రిమోట్ వర్క్ అమలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రకటించారు.
దీనిని కూడా చదవండి : Saudi Exit Warning | వెంటనే సౌదీని వీడండి.. పౌరులకు అమెరికా విజ్ఞప్తి

