అక్షరటుడే, వెబ్‌డెస్క్ : eNAM 2.0 Technical Issues | నిజామాబాద్ మార్కెట్ యార్డ్ (Nizamabad Market Yard)లో ఈనామ్ 2.0 ద్వారా పసుపు కొనుగోళ్లలో జాప్యంపై ఎంపీ అర్వింద్ (MP Arvind) ధర్మపురి స్పందించారు. జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, మార్కెటింగ్ అధికారులు, వ్యాపారస్తులతో మాట్లాడారు.
ఇప్పటివరకు ఈ నామ్ (eNAM) 1.0 ద్వారా సక్రమంగా కొనుగోళ్లు జరిగాయని, ఈ నామ్ 2.0 ద్వారా కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ నామ్ 2.0 వర్షన్లో రైతులకు లాట్ ఐడీలు జారీ చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రైతుల మొబైల్ నెంబర్ల ఎంట్రీ తప్పనిసరి తదితర కారణాలతో ప్రక్రియ ఆలస్యం అవుతుందని వారు వివరించారు. వెంటనే ఎంపీ అర్వింద్ ఢిల్లీలోని సంబంధిత ఈ నామ్ జాయింట్ సెక్రెటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్మయి గోత్మారే తో ఫోన్లో మాట్లాడారు.
eNAM 2.0 Technical Issues | మార్కెట్‌కు భారీగా పసుపు
ప్రస్తుతం మార్కెట్‌కు పెద్ద ఎత్తున పసుపు వస్తుందని ఎంపీ తెలిపారు. ఈ నామ్ 2.0 లో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని, దీంతో రైతులు, వ్యాపారస్తులు, మార్కెటింగ్ అధికారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఈనామ్ 2.0 లో ఉన్న సాంకేతిక ఇబ్బందులను (eNAM 2.0 Technical Issues) సత్వరమే పరిష్కరించాలని కోరారు.
eNAM 2.0 Technical Issues | ఈ నామ్ 1.0తో కొనుగోళ్లు
ప్రస్తుత సీజన్ ముగిసే వరకు ఈ నామ్ 1.0 ద్వారానే కొనుగోళ్ళ ప్రక్రియ చేపట్టాలని ఎంపీ కోరారు. దీనిపై జాయింట్ సెక్రెటరీ గోత్మారే స్పందిస్తూ ఈ నామ్ 2.0లో గల సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తామని, అప్పటివరకు ఈ నామ్ 1.0 ద్వారానే కొనుగోలు జరిగేలా తగు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కాగా గురువారం సాయంత్రమే ఈ నామ్ 1.0 ద్వారా కొనుగోలు చేపట్టాలని మౌఖిక ఆదేశాలు వచ్చినప్పటికీ, శుక్రవారం ఉదయం సాఫ్ట్‌వేర్‌లో తగు మార్పులు చేసి సమస్యను పరిష్కరించారు. తమ సమస్యలను సత్వరమే పరిష్కరించి, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా కొనసాగేలా చర్య తీసుకున్న ఎంపీకి అధికారులు, వ్యాపారస్తులు,రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

