అక్షరటుడే, వెబ్‌డెస్క్: Excise Officer Resignation | తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. ఎక్సైజ్ కమిషనర్ వేధింపులను తట్టుకోలేక, ఆత్మాభిమానం చంపుకోలేక డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ కమిషనర్ మాటలతో మనస్తాపం చెంది, ఆస్పత్రి పాలైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Excise Officer Resignation | అసలేం జరిగిందంటే..
రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తున్నారని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆరోపించారు. ‘30 ఏళ్లుగా ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను’ అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అలాగే కమిషనర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. కమిషనర్ తీరుపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని పెన్ డౌన్‌కు సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Excise Officer Resignation | తిట్ల పురాణం..
సూపరింటెండెంట్ల బదిలీల నిమిత్తం కమిషనర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు తనపై హరికిరణ్ దుర్భాషలాడినట్లు సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అతడి మాటలను తట్టుకోలేక కూప్పకూలానని.. దీంతో స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు. తీవ్ర ఆవేదనకు గురై ఉద్యోగం వీడాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యలో సోషల్ మీడియాలో సోమిరెడ్డి పోస్టు పెట్టారు. ‘ఉన్నతాధికారులు, మిత్రులకు, ఎక్సైజ్ శాఖ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. నాలాంటి వ్యక్తి శాఖలో ఇమడలేడని చాలా సార్లు అనిపించింది. నా క్షేమం కోరే ఉన్నతాధికారుల ప్రోత్సాహం వల్ల ఇన్నేళ్లు నెట్టుకొచ్చా. వారికి రుణపడి ఉంటాను. ఇక నేను ఇక్కడ ఇమడలేనని అర్థమైపోయింది. చేయని తప్పుకి పడరాని మాటలు పడ్డాను. నాలో సున్నిత మనస్తతం వాటిని స్వీకరించలేకపోయింది. చాలా అవమానకరమైన పదాలతో నన్ను తిట్టాడు.
నేను పెరిగిన వాతావరణంలో ఆత్మాభిమానంతో బతకడమే జీవింతం అని నమ్మాను. ఆకలితోనైనా చస్తాం కానీ.. ఆత్మాభిమానం వదులుకోలేం. అన్న కాళోజీ మాటలు యాది చేసుకుంటూ.. చేతకాని చావలేని, చైతన్యం చచ్చిపోయిన శాఖలో 30 ఏళ్ల పాటు పని చేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని నిర్ణయించుకున్నాను. ఉద్యోగం వీడి వెళ్లాలని బాధతో డిసైడ్ అయ్యాను. ఇన్నేళ్లు నాతో ప్రయాణం చేసిన, నాకు సహకరించిన ఉన్నతాధికారులు, మిత్రులు, సిబ్బందికి కృతజ్ఞతలు. ఈ పోస్టు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై పెడుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి..: Inter Results 2026 | రేపు ఉదయం ఇంటర్ ఫలితాలు
