అక్షరటుడే, కామారెడ్డి: Eye Camp to Drivers | డ్రైవర్లకు కంటిచూపు చాలా ముఖ్యమని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ కార్యాలయంలో బుధవారం డ్రైవర్లకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో 136 మంది డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించగా 20 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.
Eye Camp to Drivers | చికిత్స చేయించేలా చర్యలు
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. చికిత్సలు అవసరమైన డ్రైవర్లకు డోనర్ల సహకారంతో పోలీస్ శాఖ తరపున చికిత్స చేయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రమాదంలో ఒక కుటుంబ యజమాని ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని వివరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఏడాది కాలంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎస్పీ తెలిపారు. ప్రతినెలా చివరి వారంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో ప్రత్యేకంగా డ్రైవర్ల కంటి చూపుపై (Eye Camp to Drivers) దృష్టి సారించినట్లు తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ చూపు మందగించడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉంటుందన్నారు. అందుకే డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
మరణాల సంఖ్య తగ్గుముఖం
పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల ఫలితంగా జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. 2024 ఫిబ్రవరి నెలలో 22 మరణాలు నమోదు కాగా, 2025 ఫిబ్రవరి నెలలో 14 మరణాలు, 2026 ఫిబ్రవరి నెలలో 12 మరణాలు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. ఒక్క ప్రాణం కాపాడినా ఒక కుటుంబంలో వెలుగు నింపినట్లేనని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, పట్టణ సీఐ నరహరి, ట్రాఫిక్ ఎస్సై మహేష్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, డ్రైవర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర

