అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fake ginger garlic paste | కల్తీ ఆహార పదార్థాలపై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయా యూనిట్లపై మెరుపు దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రతి దానిని కల్తీ చేస్తున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి మద్యం వరకు అన్ని నకిలీవి తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. సబ్బులు, పేస్టులను కూడా వదలడం లేదు. నకిలీ ఉత్పత్తులకు బ్రాండెడ్ స్టిక్కర్లు వేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి (Rajamandri) లో కల్తీపాలు తాగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ పోలీసులు సైతం అప్రమత్తం అయ్యారు. నిత్యం తనిఖీలు చేస్తున్నారు.
Fake ginger garlic paste | సికింద్రాబాద్‌లో..
పోలీసులు ఇటీవల కల్తీ టీ పొడి, కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. శనివారం సికింద్రాబాద్ (Secunderabad)లోని లాల్లగూడలోని ఒక గోడౌన్‌లో తనిఖీలు చేపట్టారు. 1915 కిలోల కల్తీ, అపరిశుభ్రమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా సికింద్రాబాద్ జోన్ బృందం, కమిషనర్ టాస్క్ ఫోర్స్, లల్లగూడ పోలీసులతో కలిసి లాల్లపేటలోని జనప్రియ అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న ఝాన్సీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ గోడౌన్‌పై దాడి చేసింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసింది. వారి నుంచి కల్తీ అల్లంతో పాటు తయారీకి ఉపయోగించే సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Fake ginger garlic paste | ఎసిటిక్ యాసిడ్ కలిపి..
నీలా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్‌ను నడుపుతున్నారు. అందులో కె వినోద్ సూపర్‌వైజర్‌గా, టి సతీష్ ఎం శివాని కార్మికులుగా పని చేస్తున్నారు. నిందితులు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నారు. ఎసిటిక్ యాసిడ్‌ను కలిపి, ప్లాస్టిక్ టబ్‌లలో రోజుల తరబడి నిల్వ ఉంచుతున్నారు. అనంతరం ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేస్తున్నారు. నకిలీ బ్రాండ్‌లతో కూడిన స్టాంపులు/ప్యాడ్‌లను ఉపయోగించి వివిధ జనరల్ కిరణా దుకాణాలకు, అవసరమైన వినియోగదారులకు సరఫరా చేస్తున్నారని టాస్క్‌ఫోర్స్ (Taskforce) అదనపు డీసీపీ శ్రీనివాస రావు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Adulterated Ghee | డాల్డాతో నెయ్యి తయారీ.. తిన్నారంటే అంతే!

