అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fake Paneer Seizure | హైదరాబాద్ (Hyderabad) నగరంలో రోజు రోజుకు కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. పిల్లలు తాగే పాల నుంచి మొదలు పెడితే ప్రతి పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Task Force Police) పెద్ద ఎత్తున కల్తీ పన్నీరును స్వాధీనం చేసుకున్నారు.
నగర పోలీసులు ఇటీవల కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. రసాయనాలు, తక్కువ నాణ్యత గత ముడి సరుకులతో చేసి విక్రయిస్తున్న ఉత్పత్తులతో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందారు. దీంతో నగరంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిత్యం ఏదో ఒక చోట కల్తీ పదార్థాలు దొరుకుతుండటం గమనార్హం. తాజాగా సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పన్నీరు స్వాధీనం చేసుకున్నారు.
Fake Paneer Seizure | టాస్క్‌ఫోర్స్ దాడులు
సేఫ్టీ అధికారులు బుధవారం డెయిరీ కేంద్రాలపై దాడులు చేశారు. 3 వేల కిలోల కల్తీ పన్నీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్, విజయ్ మిల్క్, కర్డ్ షాపుతో సహా ఆరు షాపులలో తనిఖీలు చేపట్టారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్‌లో 1600 కిలోలు, విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్ లో 1000 కిలోల కల్తీ పన్నీర్ స్వాధీనం చేసుకున్నారు.
Fake Paneer Seizure | నగరంలో ఏది కల్తీయో
పోలీసుల దాడులతో కల్తీ మాఫియా భయ పడుతోంది. మరోవైపు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కల్తీ ఆహార పదార్థాలు లభ్యం అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలో ఏది కల్తీయో, ఏది నిజమో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా తాము తింటున్నది కల్తీ ఆహారం అని తెలిసి షాక్ అవుతున్నారు. కల్తీ పదార్థాలు విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Adulterated Ginger Garlic Paste | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

