అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fee Regulation | ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు 30 శాతం నుంచి 40 శాతం ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం (Fee Regulation) తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించి బిల్లు పాస్ చేయాలన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
Fee Regulation | ప్రైవేట్ స్కూల్స్ అడ్డగోలు దోపిడీ
రాష్ట్రంలోని 12వేల ప్రైవేట్ స్కూల్స్‌లో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని కవిత తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రులపై అడ్డగోలుగా ఫీజుల భారం మోపుతున్నాయని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావడంలో విఫలమైందని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఫీజుల నియంత్రణ చట్టం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు.
Fee Regulation | ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఇప్పటి వరకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువచ్చే ప్రయత్నం చేయడంలేదని కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ అతి చెత్త నివేదిక ఇచ్చిందని.. ఆ కమిషన్ ఇచ్చిన నివేదికలో ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలనే సిఫార్సు మాత్రమే ఆమోదయోగ్యమైందన్నారు.
Fee Regulation | ఫీజుల దోపిడీని ప్రోత్సహించిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజుల దోపిడీని ప్రోత్సహించిందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తే బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుందని కవిత హెచ్చరించారు. ఒకే సారి 40 శాతం ఫీజులు పెంచితే పేద, మధ్యతరగతి పిల్లల తల్లితండ్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రైవేటు స్కూళ్లు ఫీజులు పెంచుతున్న స్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రుల జీతాలు పెరగడం లేదన్నారు. 7 శాతం నుంచి 8 శాతం ఫీజు మాత్రమే పెంచేందుకు ప్రభుత్వం అనుమతివ్వాలి తప్ప అంతకు మించి ఫీజుల దోపిడీకి సహకరించొద్దన్నారు.
తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం
కార్పొరేట్, నార్త్ ఇండియన్ స్కూల్స్ ఏర్పాటుతో తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా కాలేజీల యాజమాన్యాలు ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. ఏటా భారీగా స్కూల్ ఫీజులు పెంచుతున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు వాటిలో పని చేస్తున్న టీచర్లు, ఉద్యోగుల జీతాలు మాత్రం పెంచడం లేదన్నారు. నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. యేటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్న ఆయా సంస్థలు వివిధ పేర్లతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొడుతున్నాయన్నారు.
ఆ స్కూళ్లలో తెలంగాణ వారికి అవకాశం ఇవ్వడంలేదు
కార్పొరేట్, నార్త్ ఇండియన్ స్కూళ్లలో తెలంగాణ వారికి కనీసం ధోబిగా కూడా అవకాశం ఇవ్వడం లేదని కవిత విమర్శించారు. అలాంటి స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వొద్దని తేల్చిచెప్పారు. తెలంగాణ వారికి ఎంప్లాయిమెంట్ ఇవ్వని స్కూళ్లు మనకెందుకని ప్రశ్నించారు. కార్పొరేట్ పాఠశాలలు సొంతంగా ప్రింటింగ్ ప్రెస్‌లు పెట్టుకొని రూ.2 వేల విలువైన పుస్తకాలను రూ.15 వేలకు అమ్ముతున్నారని ఆరోపించారు. కార్పొరేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితి దుర్భరంగా ఉందని, ప్రైవేటు టీచర్ల హక్కుల సాధన కోసం జాగృతి తరఫున పోరాటం చేస్తామన్నారు.
సీఎం విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ అని కవిత విమర్శించారు. విద్యావ్యవస్థ ఆగమవుతుంటే, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే కనీసం ముఖ్యమంత్రి రివ్యూ కూడా చేయడం లేదన్నారు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నా ముఖ్యమంత్రిలో చలనం లేదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను స్కూల్, కాలేజీల ఫీజుల భారం నుంచి బయట పడేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు 30% నుంచి 40% ఫీజులు పెంచడం మధ్య తరగతి తల్లితండ్రులకు తలకు మించిన భారంగా మారుతున్నది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేట్ స్కూల్ యాజమాన్యాల పై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. తక్షణమే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం… pic.twitter.com/olbcWhCVpY
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 3, 2026
ఇది కూడా చదవండి..: Telangana Rain Alert | తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
