అక్షరటుడే, వెబ్‌డెస్క్: Foot Care | రోజంతా మన శరీర బరువును మోస్తూ, మనల్ని అడుగు ముందుకు వేయించే పాదాల ఆరోగ్యాన్ని మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఎక్కువ సేపు నిలబడటం లేదా కూర్చుని పని చేయడం వల్ల వచ్చే పాదాల వాపులు, నొప్పులు భవిష్యత్తులో నడవడానికే కష్టమయ్యేలా చేస్తాయి. జిమ్‌కు వెళ్లి ఒళ్లు వంచే మనం, మన పాదాల కోసం కేవలం పది నిమిషాలు కేటాయిస్తే చాలు.. రక్తప్రసరణ మెరుగుపడటమే కాకుండా కాళ్లు దృఢంగా మారుతాయి.
Foot Care | కూర్చుని చేసే సులభమైన వ్యాయామాలు:
పాదాల రొటేషన్: కుర్చీలో నిటారుగా కూర్చుని, ఒక కాలును పైకి లేపి పాదాన్ని గుండ్రంగా తిప్పాలి. ముందుగా క్లాక్‌వైజ్ (సవ్యదిశలో) 10 సార్లు, ఆ తర్వాత యాంటీ-క్లాక్‌వైజ్ 10 సార్లు తిప్పాలి. ఇలా రెండు కాళ్లకు చేయడం వల్ల కండరాలకు మంచి ఉపశమనం లభిస్తుంది.
హీల్ అండ్ టో మూవ్‌మెంట్: కుర్చీలో కూర్చుని కాళ్లను ముందుకు చాచి పాదాలను పైకి, కిందకు ఆడిస్తుండాలి. ఆ తర్వాత కాళ్లను వెనక్కి తెచ్చి వేళ్లపై భారం వేస్తూ మడమలను పైకి లేపాలి. ఇలా 15-20 సార్లు చేస్తే పాదాల వాపులు తగ్గుతాయి.
వేళ్ల వ్యాయామం: నేలపై కూర్చుని కాళ్లను చాచాలి. పాదాల వేళ్లను గట్టిగా బిగించి కొన్ని సెకన్ల పాటు ఉంచి, ఆపై వదలాలి. ఇలా 10-15 సార్లు చేయడం వల్ల పాదాల్లోని చిన్న కండరాలు బలపడతాయి.
Foot Care | నిలబడి చేసే వ్యాయామాలు:
వేళ్లపై నిలబడటం: నిటారుగా నిలబడి నెమ్మదిగా కాలి వేళ్లపై భారం వేస్తూ పైకి లేవాలి. కొద్దిసేపు అలాగే ఉండి మళ్లీ సాధారణ స్థితికి రావాలి. రోజుకు 10-15 సార్లు ఇలా చేస్తే ఎక్కువ సేపు నిలబడే సామర్థ్యం పెరుగుతుంది.
మడమలపై నడక: పాదాల వెనుక భాగం అంటే మడమలపై కొన్ని అడుగులు నడవడానికి ప్రయత్నించండి. మధ్యమధ్యలో సాధారణంగా నడుస్తూ ఇలా 2-3 సార్లు చేయడం వల్ల పాదాల కండరాలు గట్టిపడతాయి.
సింగిల్ లెగ్ బ్యాలెన్స్: ఒంటి కాలిపై కనీసం 10-15 సెకన్ల పాటు నిలబడాలి. ఆ తర్వాత కాలు మార్చి మళ్లీ ప్రయత్నించాలి. ఇది శరీర సమతుల్యతను (Balance) పెంచడమే కాకుండా పాదాలకు మంచి పట్టును ఇస్తుంది.
ఇది కూడా చదవండి: Sunflower Seeds Beauty | సన్‌ఫ్లవర్ గింజలతో ఇలా చేస్తే.. రెట్టింపు అందం సొంతం!

