అక్షరటుడే, వెబ్డెస్క్: Gadwal Fire Accident | జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ పెయింటింగ్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఆ షాపు మొత్తాన్ని ఆవరించాయి.
ఉదయం వేళ మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Gadwal Fire Accident | ప్రాణ నష్టం లేదు..
అయితే అప్పటికే మంటలు విస్తరించడంతో షాపులో నిల్వ ఉంచిన పెయింట్ డబ్బాలు, రసాయన పదార్థాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రత కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతసేపు భయాందోళనలు నెలకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఘటనలో సుమారు రూ.35 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు యజమాని వాపోయారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఎండాకాలం ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేయాలని సూచనలు చేస్తున్నారు. జోగులాంబలో జరిగిన ప్రమాదం చుట్టు పక్కల వారందరిని భయబ్రాంతులకి గురి చేసింది.
ఇది కూడా చదవండి..: Nalgonda Budget 2026 | నల్గొండ నగరానికి భారీ బూస్ట్.. రూ. 281.46 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి!
