అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gas Booking Cyber Scam | దేశంలో ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతుంటే.. దీనిని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సందు దొరికితే ప్రజల ఖాతాలను లూఠీ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరిట లింక్‌లు పంపి మోసాలు చేసిన కేటుగాళ్లు తాజాగా గ్యాస్ కొరతను అవకాశంగా మలుచుకున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో గ్యాస్ కొరత (Gas Shortage) నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లను పరిమితంగా సరఫరా చేస్తున్నారు. మరోవైపు డొమెస్టిక్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందేమోననే భయంతో ప్రజలు ముందస్తుగా బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే ప్రజల ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారు.
Gas Booking Cyber Scam | తక్షణమే సిలిండర్ అంటూ..
తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో (Social Media) నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని సందేశాలు వస్తే వాటి నమ్మొద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) సూచించారు. ఆయా గ్యాస్ సంస్థల వెబ్సైట్ల ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దన్నారు.
Gas Booking Cyber Scam | బ్యాంక్ వివరాలు చెప్పొద్దు
సిలిండర్ బుకింగ్, ఆన్‌లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని సజ్జనార్ సూచించారు. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
దీనిని కూడా చదవండి : New DGP Selection | కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు.. రేసులో వీరే..

