అక్షరటుడే, ఇందూరు: Gas Cylinders | వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని.. 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోందని తెలిపారు. శుక్రవారం నాటికి 1,00,850 సిలిండర్లు జిల్లాలో గృహ అవసరాల కోసం పంపిణీ నిమిత్తం అందుబాటులో ఉన్నాయన్నారు. వీటికి అదనంగా మరో 585 సిలిండర్లు జిల్లాకు రానున్నాయని చెప్పారు. సిలిండర్ బుక్ చేసిన వారికి మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
Gas Cylinders | బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు
ఎవరైనా గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి.. బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే నిత్యవసరాల సరుకుల చట్టం 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పటికే తనిఖీలను ముమ్మరం చేయించామని తెలిపారు. మార్చిలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఆకస్మిక దాడులు జరిపిన సందర్భంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 156 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని నిర్వాహకులపై కేసును నమోదు చేశామన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, అనాథ ఆశ్రమాలకు ఇండెంట్లు అందిన వెంటనే సిలిండర్లు సరఫరా చేయాలని ఏజెన్సీల నిర్వాహకులకు సూచించారు.

Gas Cylinders | ఏజెన్సీలకు వెళ్లాల్సిన అవసరం లేదు
వినియోగదారులు ఆన్లైన్లో సిలిండర్లను బుక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏజెన్సీలు, గ్యాస్ గోదాముల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం సింగిల్ సిలిండర్‌కు 25 రోజులు, డబుల్ సిలిండర్‌కు 45 రోజుల వ్యవధి తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఏఎస్వో అరవింద్ రెడ్డి, డీటీవో ఉమామహేశ్వరరావు, డీపీవో శ్రీనివాసరావు, డీడబ్ల్యూవో పద్మ, గ్యాస్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి.. మంత్రి కోమటిరెడ్డికి ఎంపీ అర్వింద్ లేఖ

