అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Godavari Pushkaralu Arrangements | వచ్చే ఏడాది జూలైలో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్‌ను కలెక్టర్ (Collector Ila Tripathi) మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
Godavari Pushkaralu Arrangements | అధికారులకు సూచనలు..సలహాలు..
పక్షం రోజుల క్రితం సైతం పుష్కర ఘాట్ (Pushkara Ghat)ను సందర్శించిన సమయంలో అధికారులకు అప్పగించిన పనులను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. పుష్కర ఘాట్‌కు వచ్చేమార్గాల్లో రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులను, శివాలయం వద్ద కొనసాగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టాలన్నారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు భక్తులకు కనీస వసతులు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. గోదావరి పుష్కరాలకు (Godavari Pushkaralu) త్రివేణి సంగమ ప్రాంతం అయినందున ఈ ఘాట్ వద్ద పుణ్య స్నానాల కోసం ప్రముఖులతో పాటు, లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
Godavari Pushkaralu Arrangements | లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఉండాలి..
ఘాట్ వద్ద ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాకపోకలకు ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు ఆయా మార్గాలలో అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణాలు సైతం చేపట్టాలన్నారు. వీవీఐపీల కోసం హెలిప్యాడ్‌ను నిర్మించాలని, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటి వాటిని నాణ్యతతో చేపట్టి నిర్ణీత గడువు లోపు పూర్తి చేసేలా చూడాలన్నారు. ఘాట్ వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు కందకుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెంజల్ మండల (Renjal Mandal) అధికారులతో సమావేశమయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, జనాభా గణన ప్రక్రియల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato), దేవాదాయ శాఖ అధికారులు కమల, విజయరామారావు, తహశీల్దార్ శ్రవణ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Labour Codes Protest | లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందే.. టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన
