అక్షరటుడే, వెబ్డెస్క్ : Godavari Pushkaralu | గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్షించారు. 2027 జూన్‌లో పుష్కరాలు జరగనున్నాయి. వీటిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి నుంచే ఏర్పాట్లపై చర్యలు చేపడుతోంది.
పుష్కరాల కోసం బాసర (Basar) నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆలయాలు, పుష్కరఘాట్ల అభివృద్ధి కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘంతో పాటు అధికారులతో ఆదివారం సీఎం చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి ఇంజనీర్లతో టెక్నికల్ కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 20 రోజుల్లో నివేదికను సమర్పించాలన్నారు.
Godavari Pushkaralu | వార్ రూమ్ ఏర్పాటు
ఇంజనీర్ల కమిటీ నివేదికను పరిశీలించి, పూర్తి అంచనాలతో మంత్రివర్గ ఉప సంఘానికి పంపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉప సంఘం ఆమోదించిన తర్వాత పుష్కరాల సమగ్ర ప్రణాళికపై మంత్రిమండలి తుదినిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పుష్కరాల కోసం శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్‌లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
Godavari Pushkaralu | భక్తులకు ఇబ్బందులు లేకుండా..
ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణ చేపట్టేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు కల్గకుండా చూడాలన్నారు. బాసర సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించగా, ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : KTR land controversy | నా భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి ఇచ్చారు.. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు
