అక్షరటుడే, వెబ్డెస్క్ : Students Drowned | భద్రాచలం (Bhadrachalam)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఐదుగురు విద్యార్థులు గోదావరి నదిలో గల్లంతు అయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి.
ఏపీలోని అమరావతిలో గల ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (SRM University) ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఏడుగురు విద్యార్థులు భద్రాచలం పర్యటనకు వచ్చారు. భద్రాచలం – కూనవరం రోడ్డులోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు ప్రాంతంలో గోదావరి (Godavari) అందాలను చూసేందుకు విద్యార్థులు వెళ్లారు. అనంతరం ఏడుగురు నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటం, నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో విద్యార్థులు నీట మునిగారు. అందులో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా ఐదుగురు కొట్టుకుపోయారు.
Students Drowned | ఇద్దరి మృతదేహాలు లభ్యం
ప్రాణాలతో బయటపడ్డ విద్యార్థులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గల్లంతైన విద్యార్థులను సతీశ్ – మదనపల్లి(చిత్తూరు జిల్లా), నవదీప్ – ఉయ్యూరు(కృష్ణా జిల్లా), తేజజ్ఞ – ఉయ్యూరు(కృష్ణా జిల్లా), భద్రాచలానికి చెందిన అభిరామ్, శ్రీకర్గా గుర్తించారు. వీరిలో శ్రీకర్, నవదీప్ మృతదేహాలు లభ్యం అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Students Drowned | మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి
విద్యార్థుల గల్లంతు ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల గల్లంతు వార్తతో యూనివర్సిటీలో విషాదం నెలకొంది.
దీనిని కూడా చదవండి : Shadnagar Pond Accident | పండగపూట విషాదం.. కొలనులో జారిపడి యువకుడి మృతి

