అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Gram Ward Sabha | ప్రభుత్వం వచ్చేనెల 2వ తేదీన పంచాయతీలు, మున్సిపాలిటీలో నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి అనంతరం అధికారులకు పలు అంశాలపై ఆమె కీలక సూచనలు చేశారు.
Gram Ward Sabha | ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా..
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముందస్తుగానే గ్రామ, వార్డు సభల వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లతో సమావేశమై తగు సూచనలు చేయాలన్నారు. గ్రామసభలు నిర్వహించే ప్రదేశాల్లో తగిన నీడ, తాగునీరు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 7.30 నుంచి 10.30 గంటల్లోపు సభలు నిర్వహించాలని సూచించారు.
Gram Ward Sabha | లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సభల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులతో వారి అనుభవాలను తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా గ్రామ, వార్డు సభల విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఇదిలా ఉండగా.. పదోతరగతి పరీక్షా కేంద్రాలను (SSC Examination Centers) క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహశీల్దార్లకు కలెక్టర్ సూచించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సాఫీగా జరిగేలా చొరవ చూపాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Gram Ward Sabha | ప్రజావాణిలో ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
కలెక్టరేట్లో ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం ప్రజావాణికి 106 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ మస్తాన్ అలీలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Labour Codes Protest | నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందే..
