అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hanuman Jayanti | శక్తికి, భక్తికి నిలువుటద్దం హనుమంతుడు. కలియుగంలో భక్తుల కష్టాలను తీర్చే చిరంజీవిగా ఆంజనేయస్వామిని ఆరాధిస్తాం. ముఖ్యంగా చైత్ర పౌర్ణమి నాటికి ఒక ప్రత్యేకత ఉంది. ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం ఈ రోజే స్వామివారి జన్మదినం.
మరికొన్ని చోట్ల హనుమంతుడు శ్రీరాముడిని కలిసిన విజయ దినంగా దీనిని పరిగణిస్తారు. ఈ ఏడాది (2026) ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ పవిత్ర పర్వదినం ప్రాముఖ్యం, పూజా విధానం , పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Hanuman Jayanti | ముహూర్తం, తిథి వివరాలు:
పంచాంగం ప్రకారం.. చైత్ర పౌర్ణమి తిథి ఏప్రిల్ 1, బుధవారం ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 2, గురువారం ఉదయం 7:41 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయ తిథిని పరిగణనలోకి తీసుకుంటే, ఏప్రిల్ 2వ తేదీ, గురువారం నాడు హనుమాన్ జయంతిని నిర్వహించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ దశమి నాడు కూడా హనుమజ్జయంతిని ఘనంగా జరుపుకొంటారు. ఈ రెండు సమయాల్లోనూ భక్తులు 41 రోజుల పాటు హనుమాన్ దీక్ష చేపట్టి స్వామిని కొలుస్తారు.
Hanuman Jayanti | పూజా విధానం:
అభ్యంగన స్నానం: జయంతి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, శుచిగా స్నానం ఆచరించాలి.
సింధూర సమర్పణ: హనుమంతునికి సింధూరం అంటే అత్యంత ప్రీతి. గుడికి వెళ్లి స్వామికి సింధూరాన్ని సమర్పించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.
రామ నామ స్మరణ: ఆంజనేయుడిని పూజించే ముందు సీతారాములను స్మరించుకోవాలి. ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని నమ్మకం.
అర్చన: ఎర్ర చందనం, అక్షింతలు, ఎర్రని పూలు, నైవేద్యంగా అప్పాలను సమర్పించాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.
పారాయణం: హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించడం వల్ల మానసిక ధైర్యం కలుగుతుంది.
నైవేద్యం: భక్తి శ్రద్ధలతో హనుమంతునికి అప్పాలు, వడలు లేదా అరటి పండ్లను నైవేద్యంగా నివేదించాలి.
Hanuman Jayanti | పాటించాల్సిన నియమాలు:
సాత్విక జీవనం: ఈ పర్వదినాన మాంసాహారం, మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యాన్ని పాటించడం ముఖ్యం.
నేలపై నిద్ర: ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా హనుమత్ స్మరణలో గడుపుతూ, రాత్రి వేళ నేలపై నిద్రించడం ఉత్తమం.
జీవకారుణ్యం: హనుమంతుని స్వరూపంగా భావించే వానరాలకు బెల్లం లేదా అరటి పండ్లు తినిపించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది.
దానధర్మాలు: శక్తి కొలది పేదలకు అన్నదానం లేదా వస్తు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
మంత్ర జపం: పూజ సమయంలో “ఓం హం హనుమతే నమః” లేదా “ఓం నమో భగవతే హనుమతే నమః” వంటి మంత్రాలను జపించడం మంచిది.
ఇది కూడా చదవండి: Karna | కర్ణ మరణం నుంచి కష్టాల వరకు.. ‘సవాలక్ష’ అనే పదం ఎలా వచ్చిందంటే!
