అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Criticism | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శలు చేశారు. 800 రోజుల పాలనలో చేసిందేం లేక, 99 రోజు ప్రణాళిక పేరిట మరో డ్రామాకు సీఎం రేవంత్‌రెడ్డి తెర తీశారని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక, పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి ప్రణాళిక పేరిట నాటకాలు ఆడుతోందన్నారు. గతంలో రెండుసార్లు నిర్వహించిన ప్రజాపాలన (Prajapalana) గ్రామసభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయని మండిపడ్డారు. ఆ దరఖాస్తులకు దిక్కు లేదు కానీ, మళ్లీ ఇప్పుడు పది వారాల పాటు పది రకాల నాటకాలతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం అయిందని విమర్శించారు.
Harish Rao Criticism | రైతు భరోసా ఏది
కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో అసలు ఏం చేశారని ప్రచారం చేస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా (Rythu Bharosa) దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు యూరియా (Urea) కూడా సరఫరా చేయలేక రైతులను నడిరోడ్డు మీదకు తెచ్చారన్నారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేసిందన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడని ప్రశ్నించారు.
Harish Rao Criticism | యువ వికాసం ఏమైంది
రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పేరిట తీసుకున్న దరఖాస్తులు దిక్కు లేకుండా పోయాయని హరీశ్‌రావు అన్నారు. ఇప్పుడు యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం అంటూ కొత్త పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ అనేది ప్రభుత్వ కనీస బాధ్యత అన్నారు. దానిని కూడా ఒక ఈవెంట్ లాగా కలర్ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. పాలన గాలికి వదిలి పబ్లిసిటీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న గారడీలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో నిలదీసేందుకు సిద్ధం అవుతున్నారని చెప్పారు.

