అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Heatwave Awareness Nizamabad | వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయా శాఖల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Heatwave Awareness Nizamabad | టాస్క్ఫోర్స్ కమిటీ సైతం ఏర్పాటు..
కలెక్టర్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ (Task Force Committee)ని సైతం ఏర్పాటు చేసినట్లు ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈసారి వేసవి సీజన్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వస్తున్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వేసవిలో కార్మికులు, ప్రజలు భారీ ఉష్ణోగ్రతల వల్ల వడగాడ్పులకు లోనై ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. లేబర్ అడ్డాలు, పని ప్రదేశాలను గుర్తించి తాగునీరు అందుబాటులో ఉంచాలని, అన్ని బస్తీ దవాఖానాలు, పీహెచ్సీ, సీహెచ్సీల్లో రెట్టింపు స్థాయిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉండేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
Heatwave Awareness Nizamabad | అన్నిశాఖలు అప్రమత్తంగా..
వైద్య ఆరోగ్య, ఉపాధి హామీ, పర్యావరణ, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖలు వడదెబ్బ నివారణపై కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ (Collector Ila Tripathi) సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, కేంద్రాలకు వచ్చే వారికి ఓఆర్ఎస్ ద్రావణం అందించాలని అన్నారు. గురుకులాలు, వసతి గృహాలలో ఎండ తీవ్రతపై అవగాహన కల్పించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని సూచించారు.
Heatwave Awareness Nizamabad | వడదెబ్బ నివారణకు..
వడదెబ్బ (Heatstroke)నివారణ కోసం పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందింపజేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు వారు పనిచేసే ప్రదేశాల్లో నీడను అందించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని, కూలీలు తప్పనిసరిగా తమ వెంట తాగునీటిని తెచ్చుకునేలా చూడాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా వడదెబ్బతో ప్రజలు ఇబ్బందులు, అనారోగ్యాల బారిన పడకుండా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు.
ఇది కూడా చదవండి..: Road Safety Rules | వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సీపీ సాయిచైతన్య

