అక్షరటుడే, వెబ్‌డెస్క్: HMPV Virus | అగ్రరాజ్యం అమెరికా (America)కు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో కొత్తగా ఒక వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వార్తలు కూడా వెలువడుతున్నాయి.
సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)లో ఈ వైరల్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. “చికిత్స లేని ప్రమాదకర వైరస్”గా పేర్కొంటున్న దీని అసలు పేరు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (Human Metapneumovirus). కాగా, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
HMPV Virus | ఎంత వరకు నిజం…
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాప్స్, వీడియోలను పరిశీలిస్తే.. ఈ వైరస్ అమెరికా మొత్తం వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ మ్యాప్స్ ను అధికారిక సంస్థలు ధ్రువీకరించలేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ వైరస్ వ్యాప్తి నిజమేనని తాజా డేటా వెల్లడిస్తోంది.
HMPV Virus | HMPV అంటే ..
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ అనేది ఒక శ్వాసకోశ సంబంధిత వైరస్ గా వైద్య నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు కారడం, శ్వాసలో ఇబ్బంది ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందంటున్నారు.
HMPV Virus | వ్యాప్తి ఇలా..
దగ్గు, తుమ్ముల ద్వారా గాలిలో ఒక వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తోంది. దీంతోపాటు కలుషిత ఉపరితలాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌కు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ప్రత్యేక వాక్సిన్ లేదు. నిర్దిష్టమైన యాంటీవైరల్ చికిత్స కూడా లేదు. కేవలం లక్షణాల నియంత్రణపైనే చికిత్స ఆధారపడి ఉంది.
కొవిడ్ అంత ప్రమాదకరం కాదని చెబుతున్న ఈ వైరస్ ను 2001లోనే గుర్తించారు. ఏటా శీతాకాలం నుంచి వసంతకాలం మధ్య వ్యాపిస్తుంటుంది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉన్న వేస్ట్‌వాటర్ (మురుగు నీటి) పరీక్షల్లో ఈ వైరస్ అధిక స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా సహా పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ విజృంభిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Rupee Falls Against Dollar | మరింత పడిపోయిన రూపాయి విలువ

